CM Revanth Reddy: హైదరాబాద్‌లో జరిగిన CREDAI ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, పారదర్శక పాలసీలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. పెట్టుబడిదారుల భద్రత, లాభదాయకత, పాలసీల స్థిరత్వంపై ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
పారదర్శక పాలసీలతో అభివృద్ధి దిశగా
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలసీ, కన్‌స్ట్రక్షన్ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి రెండు గ్రోత్ ఇంజిన్లుగా భావిస్తోందని తెలిపారు. “పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం” అని ఆయన అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా, అవి లాభాలు తెచ్చేలా ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Sudarshan Chakra : స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్న భారత్
కొన్ని వర్గాలు సృష్టిస్తున్న అపోహలు, అనుమానాలను తొలగించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. “రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. ఇతర దేశాల పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న మేము, మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం?” అని రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన లక్ష్యం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. “కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్నవాడిని కాదు” అని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటానని, కానీ అనుచిత డిమాండ్లకు మాత్రం సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ ప్రసంగం ద్వారా ముఖ్యమంత్రి పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రజలకు మేలు చేకూరే విధంగా, నిబంధనల ప్రకారం మాత్రమే అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టమైన సందేశాన్ని అందించారు.