Water War : బీఆర్ఎస్‌తో ‘వాటర్‌ వార్‌’.. కాంగ్రెస్ ప్రత్యేక వర్క్‌షాప్‌

Water War : వచ్చే లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతల విమర్శలను బలంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ సర్కారు సమాయత్తం చేయనుంది.

  • Written By:
  • Updated On - February 11, 2024 / 12:33 PM IST

Water War : వచ్చే లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతల విమర్శలను బలంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ సర్కారు సమాయత్తం చేయనుంది. పార్టీ ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు ఈ నెల 13న తీసుకెళ్లడానికి ముందు.. ప్రత్యేక వర్క్ షాప్‌ను  కాంగ్రెస్ ఏర్పాటు చేయనుంది. కృష్ణా జలాల అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగిన ప్రస్తుత నేపథ్యంలో వారికి కౌంటర్ ​ఇచ్చేందుకు ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు సబ్జెక్టుపై(Water War) అవగాహన ఏర్పడితే ప్రతిపక్ష వాదనలను గట్టిగా తిప్పకొట్టడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

కృష్ణా జలాల అంశం, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు, బ్యారేజీల డ్యామేజీకి కారణాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సమాచారం, సాగునీటి ప్రాజెక్టులు,  విజిలెన్స్​నివేదికలు, గత ప్రభుత్వ తప్పులపై ఈ వర్క్‌షాప్‌లో సవివరమైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు మించి కాళేశ్వరంతో అదనంగా కలిగే లాభమేంటి ? ఆయకట్టు పెరిగిందా? రీడిజైనింగ్‌తో కలిగిన ఫలితమేంటి? ప్రతి ఏటా లిఫ్టు పంపుల విద్యుత్ వినియోగానికి అయ్యే ఖర్చు ఎంత ? అనే అంశాలపైనా సాగునీటి రంగం నిపుణులు ఈసందర్భంగా వివరించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు సీఎం రేవంత్ సహా మంత్రులు కూడా హాజరవుతారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఒప్పందాలు, సమావేశాల మినిట్స్ కూడా నిపుణులు వివరించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకు ఈ అంశాలపై లోతైన అవగాహన కలిగించాలన్నది ఈ వర్క్ షాప్ ఉద్దేశం. ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లోనే సాగునీటి రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి కసరత్తు కూడా చేస్తోంది.

Also Read : World Unani Day 2024 : భారత ముద్దుబిడ్డకు హ్యాట్సాఫ్.. ఆయన పేరిటే ‘వరల్డ్ యునానీ డే’

మేడిగడ్డ గురించి కాంగ్రెస్‌కు ఏమీ తెలియదు : కేటీఆర్

తెలంగాణలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ఈ నెల 13న రావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలికిన ఆహ్వానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఆ ప్రాజెక్ట్‌ గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమీ తెలియదని చెప్పారు.  అది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని కేటీఆర్ అన్నారు. చూడాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి చూడొచ్చని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందన్నారు. దాన్నే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని తెలిపారు. సూర్యుడి మీద ఉమ్ము వేస్తే అది మన మొహం మీదనే పడుతుందని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ డెప్త్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కట్టిందే తామే కాబట్టి.. చూడాల్సింది కాంగ్రెస్ వాళ్లని చెప్పారు.చిన్నలోపాలు ఉంటే ఎత్తి చూపాలని, అంతేగానీ దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ఏంటని కేటీఆర్ అన్నారు. తప్పు ఏదైనా జరిగితే బయట పెట్టాలని చెప్పారు. ఒకవేళ ఐఏఎస్‌ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తని చెప్పారు.