మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మండిపడిన ఆయన, రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. “20 నెలలుగా రాష్ట్రానికి గతి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి కొనసాగుతోంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కానీ వాటిలో ఒక్కటి కూడా సక్రమంగా అమలుకాలేదు” అంటూ హరీశ్ రావు ఆరోపించారు.
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
నీటి విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతోందని హరీశ్ అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని తరలిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. “కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి తెలంగాణ రైతులకు నీరు అందించే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం” అని అన్నారు.
అంతేకాకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రదర్శనలు మాత్రమే చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. “ఇప్పుడిప్పుడే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపం అర్థమవుతోంది. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు” అంటూ హరీశ్ స్పష్టం చేశారు.