Site icon HashtagU Telugu

Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!

Warangal Mgm Hospital Telangana North Telangana Health Hub

Warangal MGM: ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి.  దీన్ని ప్రజలు పెద్ద దవాఖాన అని కూడా పిలుస్తారు. తమ ఆరోగ్యాలకు ఏదైనా అయితే, పెద్ద చికిత్స అందించే కెపాసిటీ ఎంజీఎంకు ఉందనేది ప్రజల నమ్మకం. అయితే ఇటీవలే వెలుగుచూసిన పలు అంశాలు ఎంజీఎం ఆస్పత్రిపై ప్రజల్లోకి తప్పుడు ఫీడ్ బ్యాక్‌ను పంపుతున్నాయి. ప్రతినెలా ఈ ఆస్పత్రి నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. అందులో ఎంతోమంది వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది పనిచేస్తున్నా.. రోగులకు అరకొర వైద్యసేవలే అందుతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు నిదర్శనంగా నిలిచే కొన్ని తాజా  ఘటనలను చూద్దాం..

Also Read :Vyjayanthimala : వైజయంతిమాల ఆరోగ్యంపై వదంతులు.. విఖ్యాత నటీమణి జీవిత విశేషాలివీ

ఆర్థో వార్డులో పేలిన సిలిండర్  

తాజాగా శుక్రవారం సాయంత్రం వరంగల్ ఎంజీఎం(Warangal MGM) ఆస్పత్రిలోని ఆర్థో వార్డులో ఒక ఘటన చోటుచేసుకుంది. ఈ వార్డులోని రోగుల ఒక్కో బెడ్‌కు   ఒక్కో సిలిండర్ ఉంటుంది. అయితే హాస్పిటల్‌లో పని చేస్తున్న జ్యోతి అనే స్వీపర్.. ఒక పేషెంట్‌కు ఆక్సిజన్ సిలిండర్ అవసరమై వార్డులోకి వెళ్లింది. ఈక్రమంలో ఒక సిలిండర్‌పైన ఉన్న క్లిప్పు ఊడిపోయి పేలుడు సంభవించింది. దీంతో సిలిండర్‌లోని ఇనుప చువ్వ జ్యోతికి తగిలి, గాయాలయ్యాయి.దీంతో ఆమెను హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వాస్తవానికి సిలిండర్‌ను తీసుకొచ్చే పనిని వార్డ్ బాయ్స్ చేయాలి. కానీ ఆ వార్డులో ఉన్న స్వీపరుకు పనిచెప్పారు. పేలిన ఆక్సిజన్ సిలిండర్ పక్కనే మరికొన్ని సిలిండర్లు కూడా ఉన్నాయి.  ఒకవేళ అవి కూడా పేలి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేది. ఆస్పత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లలో చాలా వరకు రిపేర్లకు వచ్చినట్లు సమాచారం. వాటి ఆక్సీ మీటర్లు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి.

Also Read :MLA Quota MLCs: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. కీలక అప్‌డేట్

ప్రైవేటు ల్యాబుల దందా

కొంతమంది ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి ఎంటరై దందా నడుపుతున్నారు. వీరికి ఆస్పత్రిలోని ల్యాబ్ సిబ్బందితో పాటు పలువురు వైద్యులు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయా ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు నేరుగా ఎంజీఎంలోకి ఎంటర్ అవుతున్నారని అంటున్నారు.ఎంజీఎంలో ఉచితంగా చేసే టెస్టులకు కూడా, ఈ ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు రూ.వెయ్యికి పైగా ఛార్జీని తీసుకుంటున్నారు.

ఆ మాత్రం లెక్క తెలియదా ? 

ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల టెస్టులు చేసేందుకు ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ల్యాబ్‌లలో అప్పుడప్పుడు కెమికల్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో టెస్టులు సకాలంలో పూర్తి కావడం లేదు. దీన్ని అదునుగా వాడుకొని  ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు దందా మొదలుపెడుతున్నారు. ప్రతినెలా ఎంజీఎంకు ఎంతమంది రోగులు వస్తారు ? ఎంతమంది కోసం ఏయే రకాల టెస్టులను చేయాల్సి వస్తుంది ? అనే అంచనాలు ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారుల వద్ద ఉండవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంచనాల మేరకు ల్యాబ్‌ల సిబ్బందిని, ల్యాబ్‌ టెస్టులకు అవసరమైన సామగ్రి, రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

పసి గుడ్డును కుక్కలు పీక్కొని తిన్నాయి

ఇటీవలే ఎంజీఎంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసి గుడ్డును కుక్కలు పీక్కొని తిన్నాయి. ఈ ఘటన ఎక్కడో కాదు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ వార్డు ఎదుట కనిపించింది. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయనేది పెద్ద మిస్టరీగా మారింది. ఎట్టకేలకు ఆ పసికందు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  ఇంతకుముందు కూడా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.