Site icon HashtagU Telugu

Sharmila Vs Jaggareddy : ష‌ర్మిల `ప్ర‌జా ప్ర‌స్థానం` ప్ర‌కంప‌న‌లు

Sharmila Jaggareddy

Sharmila Jaggareddy

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల రాజ‌కీయంగా క్ర‌మంగా పుంజుకుంటున్నారు. ఆమె వాడుతోన్న ప‌దునైనా ప‌ద‌జాలం వివిధ పార్టీల నేత‌ల్ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. మ‌హాప్ర‌స్థానం పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోకి నాలుగు రోజుల క్రితం ఆమె అడుగుపెట్టారు. ఆ రోజు నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ యుద్ధం జ‌రుగుతోంది.

సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? అంటూ తొలి రోజు ష‌ర్మిల వేసిన సెటైర్లు ఆయ‌న బాగా త‌గిలాయి. ప్ర‌తిగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాడి `శీలం` చెడిపేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన స్వ‌ర్గీయ వైఎస్ ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు జ‌గ్గారెడ్డి. ఆనాడు స్వ‌ర్గీయ వైఎస్ఆర్ దేశ ప్ర‌ధానిగా రాహుల్ ను చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని, ఇప్పుడు ఆయ‌న ఆశ‌యాన్ని ష‌ర్మిల నెర‌వేర్చాల‌ని అన్నారు. ఏపీలో సీఎం అవ‌కాశం లేక‌పోవ‌డంతో తెలంగాన‌లోకి ష‌ర్మిల ఎంట్రీ ఇచ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆమె బీజేసీ వ‌దిలిన బాణ‌మంటూ విమ‌ర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌, అస‌రుద్దీన్ బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌దిలిన బాణాల‌ని ఆరోపించారు. ష‌ర్మిల ప్ర‌స్తుతం జ‌గ‌న్ వ‌దిలేసిన బాణ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. అంతేకాదు, ఏపీని మూడు రాష్ట్రాలుగా చేసుకుని జ‌గ‌న్, ష‌ర్మిల‌, విజ‌య‌సాడిరెడ్డి సీఎంలు గా ఉంటే బాగుటుంద‌ని జ‌గ్గారెడ్డి సెటైర్ వేశారు.

వైఎస్ మ‌ర‌ణించిన‌ప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ బాధ‌ప‌డ‌లేద‌ని తాజాగా జ‌గ్గారెడ్డి మ‌రో అస్త్రాన్ని సంధించారు. ఆనాడు ప‌రామ‌ర్శ‌కు వెళితే, సీఎంగా ఎవ‌ర్ని చేద్దామ‌నే రాజ‌కీయాల‌ను మాట్లాడార‌ని బాంబ్ పేల్చారు. దీంతో సీరియ‌స్ గా స్పందించిన ష‌ర్మిల ఫైర్ అయ్యారు. అబ‌ద్దాలు చెబుతోన్న జ‌గ్గారెడ్డికి ఆనాడు వైఎస్ మ‌ర‌ణం కార‌ణంగా కుటుంబం ప‌డిన బాధ ఎంతో తెలియ‌ద‌ని అన్నారు. బ‌తుకుతామా? చ‌స్తామా? తెలియ‌ని స్థితిలో ఆనాడు ఉన్న కుటుంబం ఉంద‌ని గుర్తు చేశారు. భ‌య‌పెడుతూ జ‌గ్గారెడ్డి మాట్లాడార‌ని చెబుతోన్న ఆమె ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయండ‌ని స‌వాల్ విసిరారు. మంత్రివ‌ర్గం ఫిర్యాదుకే భ‌య‌ప‌డ‌లేదు, ఇక నువ్వు ఎంత అంటూ జ‌గ్గారెడ్డిని ఆమె నిల‌దీశారు.

మొత్తం మీద ప్ర‌జా ప్ర‌స్థానం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ తో పాటుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాలకు వెళ్లిన స‌మ‌యంలో ఆమె చేస్తోన్న కామెంట్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి నిరంజ‌న్ రెడ్డి త‌దిత‌రులు తీవ్రంగా స్పందించారు. ఫ‌లితంగా ఆమె స‌క్సెస్ అవుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.