Congress vs BRS : నాగార్జున సాగ‌ర్ డ్యాం వ‌ద్ద అర్థ‌రాత్రి హైడ్రామా.. సెంటిమెంట్ కోసం కేసీఆర్ కుట్ర అంటున్న కాంగ్రెస్‌

అర్థ‌రాత్రి నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. నాగార్జున సాగర్ నుండి

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 07:49 AM IST

అర్థ‌రాత్రి నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. నాగార్జున సాగర్ నుండి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ద‌మ‌వ్వ‌గా.. ఏపీ పోలీసులు భారీగా మోహ‌రించారు. నిన్నటి నుంచి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో ఏపీఎస్పీ పోలీసులు భారీగా మోహ‌రించారు. సాగర్ వద్ద మీడియాపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి జులుం ప్ర‌ద‌ర్శించారు. క‌వ‌రేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం ఇరు రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు సృష్టించడానికేన‌ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సాగర్ డ్యాం పై పోలీసుల డ్రామా కేసీఆర్ పనేనని న‌ల్గొండ కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరోపించారు. ఓడిపోతున్నారని కేసీఆర్ కి అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని ప్ర‌జ‌లను కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని.. ఎన్ని డ్రామాలు చేసిన కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి జోస్యం చెప్పారు. ఇటు నాగార్జునసాగర్ డ్యాం పై ఏపీ పోలీసులు దండయాత్ర చేశారంటూ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు సరికాదని.. చట్ట పరిధిలో కృష్ణ జలాల సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ చేయదన్నారు.

Also Read:  Maoist Party : బిఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు