Site icon HashtagU Telugu

Invest In Telangana: సీఎం రేవంత్ ఎఫెక్ట్‌.. తెలంగాణ‌కు భారీ పెట్టుబ‌డులు..!

Invest In Telangana

Invest In Telangana

Invest In Telangana: అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌ తెలంగాణలో పెట్టుబడులకు (Invest In Telangana) సిద్ధపడింది. రాబోయే అయిదేండ్లలో వీ హబ్ లో రూ.42 కోట్ల (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో వీ హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్ లలో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ ను ఏర్పాటు చేసింది.

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెపుతున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థాన్యి సాధించలేదని అభిప్రాయ పడ్డారు.

Also Read: Shadnagar : దళిత మహిళపై థర్ట్‌ డిగ్రీ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ నుంచి పని చేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది. వీటిలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాల విస్తరణతో పాటు స్థిరమైన భవిష్యత్తు నిర్మించేందుకు సహకరిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

వీ హబ్ తో ఒప్పందం సందర్భంగా గ్రెగ్ వాల్ష్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు పడిందని అన్నారు. పెట్టుబడులతో పాటు పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాలు చేపట్టి నమ్మకమైన భాగస్వామ్యం పంచుకుంటామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానని, మన దేశం, రాష్ట్రం పట్ల కృతజ్ఞతను చాటుకునే అవకాశం దొరికిందని ఫణి అన్నారు. తమ పెట్టుబడులు, తమ సంస్థ భాగస్వామ్యం తప్పకుండా సానుకూల ప్రభావం చూపుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు రూపొందించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయని వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు.