Elections 2024 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 285 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తుండటం గమనార్హం. లోక్‌సభ అన్ని స్థానాల్లోనూ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఆంధ్రప్రదేశ్‌లోనూ పోలింగ్ మొదలైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల భవితవ్యాన్ని ఇవాళ తేల్చనున్నారు. గత ఎన్నికల కన్నా ఈసారి ఏపీలో 10వేల కేంద్ర బలగాల్ని అదనంగా కేంద్ర ఎన్నికల సంఘం మోహరించింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లలో 2 కోట్ల 3 లక్షల 39 వేల 851 మంది పురుషులు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళలు ఉన్నారు. 3,421 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. వీరందరి కోసం 46,389 పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎంలను ఎన్నికల కోసం వాడుతున్నారు. కాగా, ఇవాళ ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.