Bhadrachalam : ఆ 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలపడం సాధ్యమా?

తాజాగా భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు ఏపీ గ్రామాలు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 02:00 PM IST

తాజాగా భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు ఏపీ గ్రామాలు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆ ఐదు గ్రామాలు.. తెలంగాణలో కలపాలని కోరుతూ తీర్మానాలు చేశాయి. పంచాయితీలో చర్చించుకున్న తర్వాత ఆ గ్రామాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ జాబితాలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య.. ఈ ఐదు గ్రామాల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆ గ్రామాలను మళ్ళీ తెలంగాణలో కలపడం సాధ్యమవుతుందా ? అనే దానిపై వాడివేడి చర్చ జరుగుతోంది.

7 మండలాలు, 5 గ్రామాలు..

రాష్ట్ర విభజనకు ముందు ఆ 5 గ్రామాలు అప్పటి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత.. పోలవరం ముంపు మండలాల పేరుతో అప్పటి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ఈ ఐదు గ్రామాలు కూడా అందులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డులేకుండా ముంపునకు గురవుతాయని భావించిన ప్రాంతాన్ని ఏపీకి బదలాయించారు.
2014 జూన్ 2కు ముందు ప్రధానిగా నరేంద్రమోదీ తొలి క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మార్పులు జరిగాయి. అందులో రెండు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం కాగా, భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న నాలుగు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ప్రస్తుతం ఎటపాక, గుండాల, పురుషోత్త పట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలు ఏపీలోని అల్లూరి జిల్లా పరిధిలో ఉన్నాయి.

గతంలో ఎంతో సౌకర్యం.. ఇప్పుడెంతో అసౌకర్యం

గతంలో ఆ 5 గ్రామాల అసెంబ్లీ నియోజకవర్గం కూడా భద్రాచలంలో ఉండేది. దాదాపుగా విద్య, వైద్యం సహా అన్ని వ్యవహారాలకు భద్రాచలం మీద ఆధారపడి ఉండేవారు. కానీ విభజన తర్వాత పరిస్థితి మారింది. ప్రస్తుతం ఇవి
అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్లో ఉన్నాయి.ఎటపాక డివిజన్‌ పరిధిలో గల ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు రంపచోడవరం డివిజన్ పరిధిలోకి వస్తాయి. గిరిజన షెడ్యుల్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలు భౌగోళికంగా విస్తారంగా ఉంటాయి. ఇప్పుడు చింతూరు కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం మూలంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు 270 కిలోమీటర్లు, ఆర్డీవో ఆఫీసుకి వెళ్లాలంటే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో గతంలో తమకు అందుబాటులో ఉన్న కార్యాలయాలు ఇప్పుడు సుదూరంగా వెళ్లాయని 5 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పాడేరు కేంద్రంగా ప్రతిపాదించిన అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రమే కాకుండా రెవెన్యూ డివిజనల్ ఆఫీసు కూడా అందుబాటులో లేకుండా పోతోందనే ఆందోళన ఇక్కడి ప్రజల్లో మొదలయ్యింది.
“మా ఐదు గ్రామాలు మళ్లీ తెలంగాణలో కలిపేయండి” అని వారు డిమాండ్ చేస్తున్నారు.

5 గ్రామాల ప్రజల మనసులో మాట..

“మా 5 గ్రామాలను తొలుత ఎటపాక డివిజన్ లో , ఆతర్వాత చింతూరు డివిజన్ లో ఉంచారు. ఇప్పుడు కూడా పేరుకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ అన్నీ మాకు భద్రాచలంతోనే సంబంధాలు. ఎటపాక నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. విలీనం చేసిన తర్వాత ముంపు మండలాల పేరుతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆస్పత్రికి వెళ్లాలంటే రాజమండ్రి, కాకినాడ వెళ్లాల్సి వస్తుంది. భద్రాచలం వెళితే మీది ఆంధ్రా కాబట్టి వైద్యం అందించమని చెబుతున్నారు. ఇప్పుడు పాడేరు (అల్లూరి జిల్లా కేంద్రం) వెళ్లాలంటే ఎలా సాధ్యం అవుతుంది?కనీసం ఫైర్ ఇంజిన్ రావాలంటే 200 కిలోమీటర్ల దూరం అవుతుంది” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయ నిపుణుల మాట..

అయితే ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు ఈ 5 గ్రామాలను అప్పగించాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.అందుకు ఉభయ రాష్ట్రాలతో పాటుగా కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.