Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : పట్టు వదలని విక్రమార్కుడు భట్టి

Vikramarka Bhatti Who Did Not Give Up..

Vikramarka Bhatti Who Did Not Give Up..

By: డా. ప్రసాదమూర్తి

Bhatti Vikramarka : “సాహసి కానివాడు జీవన సమరానికి పనికిరాడు. ఎవరెస్టు శిఖరాన్ని ఒక్క టెన్సింగే ఎక్కగలడు” అని అన్నాడు కవి బాలగంగాధర తిలక్. ఇది కేవలం జీవన సమరానికే కాదు, రాజకీయ సమరానికి కూడా వర్తిస్తుంది. ఇంకా స్పష్టంగా వర్తమానానికి అన్వయించి చెప్పాలంటే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్కను ఉదాహరణగా చూపించవచ్చు. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రమాణం చేశారు. తెలంగాణలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తొలి దళిత ప్రతిపక్ష నేతగా, తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో దళిత సిఎల్పీ లీడర్ గా దామోదరం సంజీవయ్య గారు ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల తొలి దళిత ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్కనే చెప్పుకోవాలి. 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనపై ఎలాంటి విమర్శకు తావివ్వని మచ్చలేని నాయకునిగా ఎదిగిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయుడైన అనుచరుడు.

We’re Now on WhatsApp. Click to Join.

భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రస్థానం :

రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన భట్టి విక్రమార్క, హైదరాబాద్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయన సోదరులు మల్లు అనంత రాములు, మల్లు రవి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వివిధ సమయాల్లో ప్రాతినిధ్యం వహించారు. విద్యార్థి దశలో భట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంఘంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈరోజు తెలంగాణలో తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన భట్టి విక్రమార్క ప్రయాణం అంత సులువైనది కాదు. నిరంతర పరిశ్రమ, కఠోర దీక్ష, పార్టీ పట్ల అమితమైన భక్తిశ్రద్ధలు భట్టి విక్రమార్కను నేడు ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఆయన తన విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ లోనే కొనసాగి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తనను తాను నిలదొక్కుకొని, పార్టీని నిలబెట్టడానికి కష్టపడి పని చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి విధేయుడిగా, ఆయన మొట్టమొదట 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 నాటికి వైయస్సార్ హృదయంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకొని మధిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు సంపాదించి గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత కూడా ఆయన మధిర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు సాధిస్తూనే ఉన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు అదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో చీఫ్ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2019లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు చేసిన గడ్డు కాలాన్ని ఆయన దృఢంగా నిలబడి ఎదుర్కొన్నారు. పార్టీ ఉనికికి, తన అస్తిత్వానికి ఎంతటి ప్రమాదం వచ్చినా భట్టి విక్రమార్క మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీకి వీర విధేయునిగా నిలిచారు.

అంతేకాదు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని కాపాడడానికి, పార్టీ కార్యకర్తలను నిలబెట్టుకోవడానికి భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు ఆయన 109 రోజులు 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక నాటి వైయస్సార్ పాదయాత్రను అందరికీ జ్ఞప్తికి తెచ్చారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం లో జరిగిన అత్యద్భుత భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ కూడా విచ్చేశారు. ఎవరు ఎన్ని పార్టీలు మారినా, ఏ కండవాలు కప్పుకున్నా, తాను మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా పేరుకు తగినట్టు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి చివరికి తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకుని, తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అని పెద్దలు చెబుతారు. కష్టాలను ఓర్చుకొని, నష్టాలను భరించి ఆత్మస్థైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్లేవాళ్లు ఎప్పటికైనా విజయ సోపానాలు అధిరోహిస్తారు. ఈ మాటలను తన జీవితంలో నిరూపించి ఉన్నత పదవిని అధిరోహించిన భట్టి విక్రమార్కకు జనం నీరాజనాలు పడుతున్నారు. అశేష తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మనం కూడా అభినందనలు తెలియచేద్దాం.

Also Read:  India – Cyber Alert : ఇండియాలో సైబర్ అలర్ట్.. పాకిస్తాన్, ఇండోనేషియా హ్యాకర్ల పన్నాగం