Site icon HashtagU Telugu

Telangana Elections 2023 : మొత్తం 35,635 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

Vikasraj

Vikasraj

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections ) పట్టుమని ఆరు రోజులు కూడా లేవు. మరో నాల్గు రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే నవంబర్ 30 న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఈసీ (EC) పోలింగ్ కు సంబదించిన ఏర్పాట్లు పూర్తిచేసే పనిలో పడింది. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్‌రాజ్‌ (Vikasraj) తెలిపారు. 6 అసెంబ్లీ సెగ్మంట్లలో 5 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలు , 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామని తెలిపారు. అలాగే 60 మంది వ్యయ పరిశీలకులను నియమించినట్లు, ప్రతి కౌంటింగ్‌ కేంద్రానికి ఒక పరిశీలకుడు ఉండనున్నట్లు చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్టు తెలిపిన వికాస్ రాజ్.. 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మందిగా పేర్కొన్నారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్‌ చేశామని.. వాటిని తపాలా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 86 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. మొదటిసారి అందుబాటులోకి తీసుకొచ్చిన హోం ఓటింగ్ ప్రక్రియను కూడా అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. వృద్ధులు, ఉద్యోగులతో పాటు పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ముందుగానే ధరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు ఈ హోం ఓటింగ్‌ ద్వారా ఓట్లు వేశారని పేర్కొన్నారు.

ఇక పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. పోలింగ్ రోజు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల మోహరిస్తామన్నారు. 391 రూట్‌ మొబైల్స్, 129 గస్తీ వాహనాలు, 220 బ్లూకోల్ట్స్‌, అదనంగా 122 వాహనాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో రూట్‌ మొబైల్‌లో 3 సాయుధ బలగాలు, ఒక కానిస్టేబుల్, 45 ఫ్లయింగ్‌ స్క్వాడ్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్‌కు విధుల్లో ఉంటారని తెలిపారు.

Read Also : T20: సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్-రింకూ ఫినిషింగ్ టచ్.. భారత్ దే తొలి టీ ట్వంటీ

Exit mobile version