Site icon HashtagU Telugu

Sangareddy Chemical Plant Explosion : సిగాచి వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ మృతి

Vice President Ln Govan

Vice President Ln Govan

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ(Sangareddy Chemical Plant Explosion)లో సోమవారం జరిగిన భారీ ప్రమాదం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ తయారీ పరిశ్రమలో ఉన్న రియాక్టర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. గాయపడ్డవారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండగా, పలువురు చికిత్స పొందుతూ మరణించారు.

Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్లకు అనుమతులు ఇవ్వలేం: కేంద్ర నిపుణుల కమిటీ

ప్రమాద సమయంలో పరిశ్రమకు చెందిన వైస్ ప్రెసిడెంట్ ఎల్‌ఎన్‌ గోవన్‌ (Vice President LN Govan) పరిశ్రమలోకి ప్రవేశించగా, పేలుడు ధాటికి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ప్రయాణించిన కారు పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలానికి రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లు చేరుకుని పరిశీలన చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన వారు పరిశ్రమ భద్రతలపై కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేలుడు ధాటికి మరొక భవనానికి పగుళ్లు రావడం, కార్మికులు వంద మీటర్ల దూరం ఎగిరిపడటం ప్రమాద తీవ్రతను చూపుతుంది. SDRF, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

ప్రమాద స్థలంలో కార్మికుల అటెండెన్స్ రిజిస్టర్లు, ఇతర రికార్డులు దగ్ధమవడంతో కార్మికుల గుర్తింపు క్లిష్టంగా మారింది. పరిశ్రమలో ఎక్కువ మంది బిహార్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులే పనిచేస్తున్నారని సమాచారం. కార్మికుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదం పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని సీరియస్‌గా ఆలోచించేలా చేస్తోంది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.