T-Sat CEO: టి-సాట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు.

T-Sat CEO: తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మిడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్లోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

టి-సాట్ సీఈవో గా బాధ్యతలు స్వీకరించిన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనపై గురుతర బాధ్యత ఉంచిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, తన నియామకానికి సహకరించిన ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకి కృతజ్ణతలు తెలియజేసారు. ప్రజా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసేదిశగా సైతం టి-సాట్ ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఇవే సేవలందిస్తున్న ప్రభుత్వరంగ చానళ్లలో టి-సాట్ ను నెంబర్ వన్ స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇప్పటికే అకడమిక్, కాంపిటీటీవ్ రంగాల్లో అందిస్తున్న సేవల్ని మరింత విస్తృతపర్చడంతో పాటు, విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర, సాంకేతికత తదితర రంగాల్లోకి టి-సాట్ నెట్వర్క్ ను తీసుకెళ్తామన్నారు, ప్రస్థుతం నడుస్తున్న నిపుణ, విద్య చానళ్లకు అదనంగా మరిన్ని చానళ్లను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సంస్థ సిబ్బందికి కలిసి నడుద్దామని సూచనలు చేస్తూ చానళ్లను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొన్నటివరకూ టి-సాట్ సీఈవోగా పనిచేసిన శైలేష్ రెడ్డిని అభినందించారు.

ఈ సందర్బంగా మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వివిద సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసి, ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ప్రజా సమస్యలను నిరంతరం ప్రశ్న రూపంలో వెలికితెచ్చిన బోదనాపల్లి వేణుగోపాల్ రెడ్డి టి-సాట్ సీఈవోగా నియామకం కావడం గర్వకారణమన్నారు. ఉద్యమకారుడిగా ప్రసిధ్దులైన వేణుగోపాల్ రెడ్డి మంచి ఆలోచనాపరుడని, తన సామర్థ్యంతో టి-సాట్ నిర్వహణ, విస్తరణ దిశగా నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని అకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే దిశగా నిరుద్యోగులకు కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ను సిద్ధం చేయడం, పాఠశాల పిల్లలకు అకడమిక్ అంశాలను బోధించే కార్యక్రమాలను రూపొందించడంతో పాటు ఇంకా విస్తరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా వ్యవసాయం, రైతులు, గ్రామీణులకు మరియు వైద్యానికి సంబంధించిన అంశాలను టి-సాట్ మాధ్యమం ద్వారా చేరవేయాలని, ఆ దిశగా విస్తరించాలని అన్నారు. మీడియా అకాడామీ కూడా టి-సాట్ తో అడుగులు వేయాలని భావిస్తోందని, రాబోయే రోజుల్లో కలిసి పనిచేయాలని అకాంక్షించారు శ్రీనివాస్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో పాటు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, అంబేద్కర్ యూనివర్శిటి రిజిస్ట్రార్ ఎవిఆర్ఎన్ రెడ్డి, తెలంగాణ మాస పత్రిక ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావ్, టీయూడబ్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీ, మైక్ టీవీ ఛైర్మన్ అప్పిరెడ్డి, సీఈవో సతీష్, జనంసాక్షి ఎడిటర్ రహమాన్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు సారథి, సూరజ్, బుచ్చన్న, సాధిక్, పరిపూర్ణా చారి, సీఈవో కుటుంబ సబ్యులు, టి-సాట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: Telugu DMF: చిరంజీవి, మంత్రి పొంగులేటి చేతుల మీదుగా తెలుగుడీఎంఎఫ్ ప్రారంభం