Site icon HashtagU Telugu

TS -TG : ఇకపై ‘టీఎస్‌’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్‌ విడుదల

Ts Tg Talk

Ts Tg Talk

TS -TG : వాహనాల రిజిస్ట్రేషన్‌లో ఇక ‘టీఎస్‌’కు బదులుగా ‘టీజీ‘ కనిపించనుంది. దీనిపై తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించగా.. తాజాగా ఆమోదం లభించింది. తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ స్థానంలో టీజీని వాడేందుకు కేంద్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌‌ను జారీ చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు కూడా జరిపారు. దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు ‘టీజీ’తో(TS -TG)  మొదలు కానున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్‌ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29A కింద తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్‌ కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది.

Also Read : Aarogya Sri Scheme : ఇక రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం!

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో అందరూ ‘టీజీ’ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావించారు. కానీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ‘తెలంగాణ స్టేట్’ ను సూచించే ‘టీఎస్’ అనే అక్షరాలను అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రంపై తమ ఆకాంక్షను తెలియజేసేందుకు చాలా మంది తమ వాహనాలపై అనధికారికంగా ‘టీజీ’ అని నెంబర్ ప్లేట్లు పెట్టించుకున్నారు. అందుకే గత నెలలో (ఫిబ్రవరి) తెలంగాణ కేబినెట్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీఎస్‌ నుంచి టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడు కేంద్రం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది.

Also Read :Electoral Bonds : ఈసీకి చేరిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు.. 15న ఏం జరుగుతుందంటే..