Site icon HashtagU Telugu

Vehicle Driving Test : డ్రైవింగ్‌ టెస్ట్ మరింత టఫ్.. ఇక ‘సిమ్యులేటర్‌’పైనా నెగ్గాల్సిందే

Driving Simulator Test Telangana Vehicle Driving Test Driving Track Test

Vehicle Driving Test : మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైన నైపుణ్యం లేని డ్రైవర్లే. అందుకే వాహన డ్రైవింగ్‌ పరీక్షను మరింత కఠినతరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయించింది. చక్కగా ప్రాక్టీస్ చేసి డ్రైవింగ్‌పై పట్టు సాధించిన వారికే డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని భావిస్తోంది.  ఇందులో భాగంగా ఇప్పుడున్న వాటికి అదనంగా మరో కొత్త డ్రైవింగ్ టెస్టును కూడా అభ్యర్థులకు నిర్వహించనున్నారు. అదేమిటో తెలుసుకుందాం..

Also Read :Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

ఏమిటీ సిమ్యులేటర్‌ డ్రైవింగ్‌ టెస్ట్ ? 

ప్రస్తుతం డ్రైవింగ్ టెస్ట్ అంటే.. డ్రైవింగ్ ట్రాక్‌‌(Vehicle Driving Test)లో అభ్యర్థితో వాహనాన్ని నడిపించి చూస్తున్నారు. అతడు వాహనాన్ని పూర్తి కంట్రోల్‌తో నడిపిస్తే డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో రాబోతున్న కొత్త విధానంలో డ్రైవింగ్ ట్రాక్ పరీక్ష కంటే ముందు సిమ్యులేటర్‌పై డ్రైవింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. సిమ్యులేటర్‌ అనేది ఒక పరికరం. ఇందులో డ్రైవింగ్ సీటు, స్టీరింగ్, గేర్లు, బ్రేక్, క్లచ్, హారన్, లైట్స్, ఎదురుగా మూడు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉంటాయి. ఇవన్నీ ఒక ప్రత్యేక గదిలో ఉంటాయి. ఈ గదిలోనే అభ్యర్థి సీటుపై కూర్చొని స్టీరింగ్  పట్టుకొని డ్రైవింగ్‌ చేయాలి. అభ్యర్థి స్టీరింగ్‌తో డ్రైవింగ్ చేస్తుండగా .. అది లైవ్‌లో స్క్రీన్‌లో కనిపిస్తుంటుంది.  అభ్యర్థి డ్రైవింగ్ చేస్తుండగా.. అతడికి ట్రాఫిక్‌ సవాళ్లను పెంచేలా ప్రత్యేకమైన సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఈ  డ్రైవింగ్‌ టెస్టులో పాల్గొనే వారి ముఖంలోని హావభావాలను కూడా కెమెరాలు రికార్డు చేస్తాయి.  బాగా ట్రాఫిక్‌ ఉన్నప్పుడు ఎలా స్పందిస్తున్నారు ? పక్కనుంచే వాహనం దూసుకుపోతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు ? ఒత్తిడికి గురవుతున్నారా? అనే దానిపై అంచనాకు రావడానికి ఈ ఫుటేజీని ఉపయోగిస్తారు. బాగా వర్షం పడుతున్నప్పుడు, పొగమంచు ఉన్నప్పుడు  డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ?  అనేది కూడా పరిశీలిస్తారు. సిమ్యులేటర్‌లోని సదరు సాఫ్ట్‌వేర్ ఆయా ట్రాఫిక్ సవాళ్లను అభ్యర్థి అధిగమించే తీరు ఆధారంగా అతడి డ్రైవింగ్ నైపుణ్యాలకు రేటింగ్‌ను కేటాయిస్తుంది.

Also Read :GT vs SRH: హైదరాబాద్‌పై గుజరాత్ ఘనవిజయం.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్లే!

తొలి విడతగా 18 ఆర్టీఓ  కార్యాలయాల్లో.. 

సిమ్యులేటర్‌పై డ్రైవింగ్‌ పరీక్షను నిర్వహించే ప్రతిపాదనకు తెలంగాణ రవాణాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తెలంగాణలో 61 ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. అయితే తొలి విడతగా 18 కార్యాలయాల్లో 34 డ్రైవింగ్‌ సిమ్యులేటర్లను ఏర్పాటుచేయాలని రవాణాశాఖ ప్రపోజ్ చేసింది.  ఈ పరీక్షకు అతి తక్కువ ఫీజును ప్రతిపాదించే కంపెనీని టెండర్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఆ కంపెనీయే డ్రైవింగ్‌ సిమ్యులేటర్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను చేపడుతుంది. డ్రైవింగ్‌ సిమ్యులేటర్‌ పరీక్ష ద్వారా వచ్చే ఫీజు ఆదాయంలో 50శాతం రవాణాశాఖకు ఇచ్చేలా నిబంధనలు రెడీ చేశారు.

Exit mobile version