Vegetable Prices : హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో ఏదైనా కూర కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 08:00 PM IST

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో ఏదైనా కూర కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొన్ని కూరగాయల రేట్లు తగ్గి ఉపశమనం కలిగితే.. మరికొన్ని కూరల ధరల రేట్లు మాత్రం జేబుకు చిల్లుపెడుతున్నాయి. అలాంటివాటిలో టమాటా ముందు వరసలో ఉంది.

వారం కిందటి వరకు.. అంటే ఏప్రిల్ 24న కొత్త పేట రైతు బజార్ లో కేజీ రూ.22 ఉన్న టమాటా.. ఇప్పుడు ఏకంగా రూ.38లకు పెరిగింది. అంటే కేవలం వారం రోజుల్లోనే కేజీకి రూ.14 మేర పెరిగింది. కేజీ పచ్చిమర్చి ఖరీదు రూ.ఐదు పెరిగింది. క్యారెట్, క్యాప్సికమ్ ధర తగ్గినా.. మిగిలిన కూరగాయ రేట్లు మాత్రం గూబ గుయ్యిమనిపిస్తున్నాయి. ఇక తోపుడు బండ్లపైన అమ్మేవారైతే.. కేజీకి రూ.10 పెంచి అమ్ముతున్నారు.

నిమ్మకాయలు కూడా ఏమాత్రం రేటు తగ్గట్లే. పెద్ద సైజు కాయలైతే కేజీకి రూ.250-300, చిన్న సైజు కాయలైతే.. కేజీకీ రూ.150-200 వసూలు చేస్తున్నారు. రంజాన్ సీజన్ కావడం వల్లే వ్యాపారులు రేట్లు పెంచారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో ముస్లింలు రోజా ఉంటారు. రంజాన్ రోజున వంటకాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అంటే బిర్యానీలు, ఇతర వంటల్లో టమోటాలు, పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే రేట్లను విపరీతంగా పెంచి అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వేసవిలో పంట దిగుబడి తగ్గుతుంది. అందుకే రేట్లు కూడా క్రమంగా పెరుగుతుంటాయి. అయినా తగిన ముందుజాగ్రత్తలు తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదంటున్నారు ప్రజలు.