ఢిల్లీలో రేవంత్‌కి చెక్‌.. మ‌రో యువ‌నేత‌కు కీల‌క బాధ్య‌త‌లు

అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌పై కొంత‌మంది క‌న్నుప‌డిందా? మ‌రో కీల‌క తెలంగాణ యువ‌నేత‌కు ఏఐసీసీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డం వెనుక ఎవ‌రి హ‌స్తం ఉంది? చ‌ద‌వండి..

  • Written By:
  • Updated On - October 27, 2021 / 05:22 PM IST

ఢిల్లీ.. రేవంత్‌రెడ్డి. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అధఃపాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. సోష‌ల్‌మీడియా ఎలివేష‌న్స్ ఒక‌వైపు.. రేవంత్ దూకుడు మ‌రోవైపు వెర‌సి ఇన్నాళ్లూ ప్ర‌శాంతంగా ఉన్న కేసీఆర్‌కు నిద్ర‌ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి. ఎంత‌గా అంటే మ‌ళ్లీ కేసీఆర్ యాక్టివ్ అవ్వ‌డాన్నిజ‌నం క్లియ‌ర్‌గా గ‌మ‌నించేంత‌గా..

రేవంత్ పీసీసీ అవ్వ‌డం వెనుక రాహుల్‌గాంధీ ప‌ర్స‌న‌ల్ ఇంట్ర‌స్ట్ ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. యువ‌నేత‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్తే.. పార్టీ ప‌రుగులు పెడుతుంద‌న్న అభిప్రాయ‌మే కావ‌చ్చు కానీ.. ఏళ్ల నుంచి ప‌ద‌వి కోసం క‌ళ్లు కాయ‌లుకాసేలా ఎదురుచూసిన చాలామంది సీనియ‌ర్స్‌కి ఇది మింగుడుప‌డ‌లేదు. ఫ‌లితంగా పార్టీలో వ‌ర్గాలు త‌యార‌య్యాయి. కానీ.. ఇవేమీ ప‌ట్టించుకోకుండా రేవంత్ త‌న ప‌ని తాను చేసుకునిపోతున్నాడు.

 

అయితే, రేవంత్ దూకుడుకు, పార్టీలా కాకుండా సింగిల్‌మ్యాన్ ఎలివేష‌న్స్‌కు బ్రేక్ వేయ‌డానికి ఢిల్లీలో ఓ వ‌ర్గం పావులు క‌దుపుతోంద‌న్న‌ది వార్త‌. రాహుల్‌గాంధీ దీన్ని వ్య‌తిరేకిస్తున్నా కూడా డైర‌క్ట్ సోనియాతో ట‌చ్‌లో ఉండే కొంత‌మంది నేత‌లు ఇందుకు సంబంధించి గ‌ట్టిగా ట్రై చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో .. తెలంగాణ‌కు చెందిన మ‌రో కీల‌క యువ‌నాయ‌కుడికి ఏఐసీసీలో అతికీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏఐసీసీ కార్యకర్త, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనేత్రి సోనియా గాంధీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి సహాయకుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన గతంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగ నాయకుడిగా.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచే అధిష్టానం వద్ద గుర్తింపు పొందిన వంశీచంద్ తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయకుడిగా నియమితులయ్యారు. అంటే.. ఇక‌పై రేవంత్ తీసుకునే ఏ నిర్ణ‌య‌మైనా వంశీచంద్ ద్వారానే హైక‌మాండ్‌కు వెళ్లాలి. వంశీచంద్‌రెడ్డికి ఈ స్ధాయి బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డం ఖ‌చ్చితంగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్ట‌డానికే అని విశ్లేష‌కులు, కాంగ్రెస్ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.