పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం ఒక పంపు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 పంపులను అమర్చి పనులను వేగవంతం చేశామని

Published By: HashtagU Telugu Desk
Palamuru Ranga Reddy Lift I

Palamuru Ranga Reddy Lift I

  • బీఆర్‌ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు
  • గత ప్రభుత్వం కేవలం కాలేశ్వరంపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు
  • గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసాం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరదించారు. ఈ ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారం 90 టీఎంసీల (90 TMC) నీటి కేటాయింపులతోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో విడుదల చేసిన జీవో (GO) ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నామని, ఇందులో ఎలాంటి మార్పులు లేవని ఆయన వివరించారు. ఈ 90 టీఎంసీలలో 45 టీఎంసీలు చిన్న నీటి పారుదల పొదుపు ద్వారా, మిగిలిన 45 టీఎంసీలు గోదావరి జలాల మళ్లింపునకు బదులుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటాగా వాడుకుంటామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం కేవలం కాలేశ్వరంపైనే లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రూ. 27,000 కోట్లు మాత్రమే కేటాయించి, పనులను నెమ్మదిగా సాగదీశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం భూసేకరణ మరియు కాలువల పనులతో కలిపి రూ. 70,000 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ప్రభుత్వం పర్యావరణ మరియు హైడ్రాలజీ అనుమతులు సాధించడంలో కూడా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం ఒక పంపు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 పంపులను అమర్చి పనులను వేగవంతం చేశామని, భారీ ఎత్తున కాంక్రీట్ మరియు మట్టి పనులను పూర్తి చేశామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ సహా పలు జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని, రాజకీయ విమర్శలను పక్కనపెట్టి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు కరువును పారద్రోలుతామని ఆయన భరోసా ఇచ్చారు.

  Last Updated: 30 Dec 2025, 10:39 AM IST