PMO, KTR Blame Game: ముచ్చింతల్ `బ్లేమ్ గేమ్`

కేంద్రం, తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ల మ‌ధ్య బ్లేమ్ గేమ్ న‌డుస్తోంది. ప‌లు అంశాల‌పై నింద‌లు వేసుకుంటూ రాజ‌కీయాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ర‌క్తిక‌ట్టిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 01:24 PM IST

కేంద్రం, తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ల మ‌ధ్య బ్లేమ్ గేమ్ న‌డుస్తోంది. ప‌లు అంశాల‌పై ప‌ర‌స్ప‌రం అప‌వాదులు, నింద‌లు వేసుకుంటూ రాజ‌కీయాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ర‌క్తిక‌ట్టిస్తున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు `పీఎంవో, సీఎంవో ` వ్యవహారం ముచ్చింతల్ రూపంలో తెర‌మీద‌కు వ‌చ్చింది. ముచ్చింత‌ల్ లోని స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌, భార‌త్ బ‌యోటెక్ ప‌రిశీల‌న కు వ‌చ్చిన మోడీ వెంట కేసీఆర్ లేక‌పోవ‌డంపై పీఎంవో, కేటీఆర్ భిన్నంగా చెప్ప‌డం దుమారాన్ని రేపుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు సీఎంను వ‌ద్ద‌ని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం(పీఎంవో) సంకేతం ఇచ్చింద‌ని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న వెల్ల‌డించారు. దానిపై పీఎంవో తీవ్రంగా స్పందించింది. ప్ర‌ధాని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావ‌ద్ద‌నే సంకేతం కేసీఆర్ కు పీఎంవో ఇవ్వ‌లేద‌ని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ట్విట్టర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ రోజున కేసీఆర్ కు హెల్త్ బాగాలేద‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం పీఎంవోకు ఇచ్చిన స‌మాచారాన్ని కేంద్ర మంత్రి సింగ్ బ‌య‌ట‌పెట్టారు.

ప్ర‌ధాన మంత్రి మోడీ ప‌ర్య‌ట‌న‌ల‌కు కేసీఆర్ దూరంగా ఉండ‌డంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ప‌చ్చి అబ‌ద్దాలు చెబుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యాన్ని, ప్ర‌ధాన మంత్రిని అవ‌మాన‌ప‌రుస్తూ మురికి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ త‌రువాత కూడా సీఎం కేసీఆర్ ఎందుకు ముంచింత‌ల్ విజిట్ చేయ‌లేదో చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌ధాని మోడీ చేసిన ఆ రెండు ప‌ర్య‌ట‌న‌ల‌పై గ‌త రెండు నెలలుగా మౌనం వ‌హించిన‌ కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని నిల‌దీశారు.

కేవ‌లం స‌మ‌తా మూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌, బ‌యోటెక్ ప‌ర్య‌ట‌న‌ల‌కే కాదు రెండు రోజుల క్రితం న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రుల వ‌ర్చువ‌ల్ మీటింగ్ కు కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈనెల 30వ తేదీన ప్ర‌ధాని, సుప్రీం చీఫ్ జ‌స్టిస్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యే ఆయా రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల సద‌స్సుకు గైర్హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ విష‌యాన్ని సీఎంవో కార్యాల‌యం ధ్రువీక‌రిస్తూ కేసీఆర్ స్థానంలో న్యాయ‌శాఖ మంత్రిగా ఉన్న ఇంద్ర‌క‌రణ్ రెడ్డి స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం ఇచ్చింది. అంతేకాదు, మోడీ నిర్వ‌హించిన సీఎంల వ‌ర్చువ‌ల్ మీటింగ్ పై కేసీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆ స‌మావేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల త‌గ్గింపుపై మోడీ మాట్లాడ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు సీఎంల‌తో వ‌ర్చువ‌ల్ మీటింగ్ అంటూ పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లను రాష్ట్రాలు త‌గ్గించాలంటూ పొలిటిక‌ల్ గేమ్ ఆడార‌ని కేసీఆర్ నిల‌దీశారు. ఇదేం రాజ‌కీయం అంటూ జాతీయ ఎజెండాను ప్లీన‌రీ సంద‌ర్భంగా వెలుగెత్తి చాటిన విష‌యం విదిత‌మే.

తెలంగాణ సీఎం కెసిఆర్, మోడీ మధ్య గ‌త ఏడాది (2021) సెప్టెంబర్‌లో చివ‌రి భేటీ జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని హైదరాబాద్‌కు వ‌చ్చారు. ఆ సమయంలో సిఎం ఆరోగ్య పరిస్థితి బాగాలేద‌ని కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ ను మోదీ సందర్శించారు. ఆ స‌మ‌యంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ లేరు. దీనిపై ఇటీవ‌ల జాతీయ మీడియా మంత్రి కేటీఆర్ ను ప్ర‌శ్నించగా మోడీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రధాని కార్యాలయం సీఎంను కోరిందని చెప్ప‌డం దుమారాన్ని రేపింది. వాస్తవంగా ముచ్చింత‌ల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ముందు రోజు మంత్రి శ్రీనివాస్ యాద‌వ్ ను ప్ర‌ధాని మోడీని ఆహ్వానించేందుకు విమాశ్ర‌యానికి పంపిస్తున్నాన‌ని కేసీఆర్ మీడియాకు చెప్పారు. ఆ రోజున ఆరోగ్యం బాగోలేదని చెప్పిన విష‌యాన్ని ఇప్పుడు బీజేపీ గుర్తు చేస్తోంది.

ప్ర‌ధాన మంత్రి మోడీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉండ‌డంపై సీఎం కేసీఆర్ చెప్పిన దానికి మంత్రి కేటీఆర్ జాతీయ మీడియాలో చేసిన వ్యాఖ్య ల‌కు ఏమాత్రం పొంత‌న‌లేదు. ఇద్ద‌రూ భిన్నంగా స్పందించ‌డాన్ని తెలంగాణ బీజేపీతో పాటు కేంద్ర మంత్రులు, పీఎంవో కార్యాల‌యం కూడా త‌ప్పుబ‌డుతోంది. గతంలో కేసీఆర్‌కు చాలాసార్లు మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చిన విష‌యాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి మాత్ర‌మే మోడీ, కేసీఆర్ మ‌ధ్య అంత‌రం పెరుగుతూ వ‌చ్చింది. ఆనాటి నుంచి కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్యన ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మ‌నేలా ఉంది. హుజూరాబాద్ ఫ‌లితాల త‌రువాత వరి ధాన్యం కొనుగోలు చేయ‌డంలేదంటూ కేంద్రంపై తొలిసారి కేసీఆర్ పోరాటానికి తెర‌లేపారు. ఆ విష‌యాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు తీసుకెళ్లారు.

వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు. పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట కేంద్రం వైఖ‌రిని అభ్యంత‌ర పెట్టిన సంద‌ర్భంగా కేసీఆర్, కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి మ‌ధ్య కొన్ని రోజులు ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం న‌డిచింది. ఆ త‌రువాత న‌రేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కేంద్ర రాజకీయాల‌పై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌త్యేక జాతీయ ఎజెండా అంటూ ప్లీన‌రీ వేదిక‌గా స్లోగ‌న్ అందుకున్నారు. చైనా, భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఏమి జ‌రుగుతుందో తెలుసుకోవాలంటూ చైనా చొచ్చుకు రావ‌డంపై కేసీఆర్ సీరియ‌స్ గా మోడీని టార్గెట్ చేశారు. హైద‌రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకు విద్యుత్‌, నీటి స‌ర‌ఫ‌రాను క‌ట్ చేస్తామంటూ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మోడీ ప‌ర్య‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాల‌ని పీఎంవో సంకేతం ఇచ్చిందంటూ కేటీఆర్ జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య మ‌రో బ్లేమ్‌ గేమ్ ప్రారంభం అయింది. దీనికి ఎలాంటి ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.