School Buses: భద్రత లేని బస్సులు.. ప్రమాదంలో బడి పిల్లలు!

హైదరాబాద్ లో 75 శాతంపైగా బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.

  • Written By:
  • Updated On - June 12, 2023 / 04:18 PM IST

వేసవి సెలవుల తర్వాత బడి గంట మోగింది. దీంతో పిల్లలు ఈరోజు బడి బాట పట్టారు. ప్రతి అకాడమిక్ ఇయర్ కు వేలాది మంది చిన్నారులు పాఠశాలల్లో అడ్మిషన్స్ పొందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నా విద్యార్థుల భద్రతను మరిచిపోతున్నాయి. మహానగరమైన హైదరాబాద్ లో 75 శాతంపైగా బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. పాతబడిన, నాణ్యతలేని బస్సుల్లోనే విద్యార్థులను పాఠశాలలు, ఇళ్లకు తరలిస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని దాదాపు 20 వేల పాఠశాల బస్సుల్లో కేవలం 5 వేలకు మాత్రమే గుడ్ కండీషన్స్ తో ఉన్నాయి. దీంతో స్కూల్ బస్సులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పునరుద్ధరించాలని పాఠశాల యాజమాన్యానికి ప్రాంతీయ రవాణా సంస్థ (ఆర్‌టీఏ) ఎలాంటి నోటీసులు జారీ చేయకపోవడం ఆశ్చర్యకరం. నిబంధనల ప్రకారం.. పాఠశాల బస్సులు తమ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రమాణాలలో ప్రథమ చికిత్స వస్తు సామగ్రి, విద్యార్థులకు సహాయం చేయడానికి అటెండెంట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న డ్రైవర్, ఎమర్జన్సీ డోర్స్, అగ్నిమాపక పరికరాలు ఉండాలి. కానీ ఆచరణలో ఈవేమి కనిపించడం లేదు.

గ్రేటర్ లో 75శాతం బస్సులు నాణ్యతలేనివిగా ఉండటంతో  హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (HSPA) విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై తెలంగాణ ఆటో అండ్ మోటర్ వెల్ఫేర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం దయానంద్ మాట్లాడారు. ‘‘ గతంలో పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే ఆర్టీఏ పాఠశాల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లు, అధికారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం చూస్తున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Mallareddy Dance: డీజే మల్లారెడ్డి, టిల్లు పాటకు డాన్స్ వేసిన మంత్రి!