Union Minister Post: బీజేపీ బిగ్ స్కెచ్.. తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి!

తెలంగాణ, ఏపీకి చెరో (Union Minister post) ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Bjp

Bjp

బీజేపీ (BJP) అధినాయకత్వం తమ ప్రణాళికలను దక్షిణాది రాష్ట్రాలపై ముమ్మరం చేయబోతుందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతుందా? మోడీ, అమిత్ షాలు బిగ్ స్కెచ్ వేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ.. దక్షిణాదిన మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. కర్నాటక మినహా మిగత రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ఐతే తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న కమలం నేతలు.. ఇక్కడ పార్టీ బలోపేతంపై సీరియస్‌గా దృష్టి సారించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో పెద్ద పీట వేయాలని యోచిస్తోంది. తెలంగాణ, ఏపీకి చెరో కేంద్రమంత్రి పదవి (Union Minister post) ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవిలో ఉన్నారు. ఈసారి మరొకరికి కూడా కేంద్రమంత్రి పదవిని (Union Minister post) కట్టబెట్టే యోచనలో ఉంది బీజేపీ. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ గెలిచింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు విజయం సాధించారు. యూపీ నుంచి లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వీరిలో కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఐతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని.. రాష్ట్రానికి మరో కేంద్రమంత్రి పదవి ఇచ్చే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో.. ధర్మపురి అర్వింద్, రాజ్యసభ్యుడు లక్ష్మణ్‌లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. బీసీ కోటాలో లక్ష్మణ్, ఉత్తర తెలంగాణ నుంచి ధర్మపురి అర్వింద్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ గెలిచిన మొత్తం నాలుగు ఎంపీ సీట్లలో మూడు సీట్లు.. ఉత్తర తెలంగాణ నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నేతల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవిని (Union Minister post) కట్టబెట్టాలని కేంద్రం భావిస్తుందట. హైదరాబాద్ నగరం నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి పదవిలో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తే.. మళ్లీ హైదరాబాద్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే కోణంలోనూ ఆలోచిస్తున్నారట. అలా కాకుండా.. బీజేపీకి మూడు సీట్లు ఇచ్చిన ఉత్తర తెలంగాణకు.. ఈసారి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind)కు కేంద్రమంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది.

అటు ఏపీలో మాత్రం బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా బీజేపీ గెలవలేదు. కానీ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రం ఉన్నారు. సీఎం రమేష్‌తో పాటు జీవీఎల్ నరసింహారావు. జీవీఎల్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ.. ఆయన ఏపీకి చెందినవారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఒకిరి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. సీఎం రమేష్.. టీడీపీ నుంచి వచ్చిన నేత. కానీ జీవీఎల్ మాత్రం ముందు నుంచీ బీజేపీలో ఉన్నారు. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆయనకు పేరుతుంది. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావుకే కేంద్రమంత్రి పదవి రావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బీజేపీ సౌత్ ఆపరేషన్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని దక్షిణాది (South) నుంచే పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని ఏదైనా స్థానం నుంచి పోటీ చేయవచ్చుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోడీ సౌత్ నుంచి గెలిస్తే.. పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పొలిటికల్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

  Last Updated: 07 Jan 2023, 12:04 PM IST