Site icon HashtagU Telugu

Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: రాష్ట్ర అభివృద్ధిలో ఒక తెలంగాణ బిడ్డగా తన వంతు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరితే ఆయన బాధ్యతా రాహిత్యంగా తప్పించుకునేలా మాట్లాడుతున్నార‌ని టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. పరమత సహనంతో మెలిగే తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అనే మాటను ప్రజలు కలలో కూడా ఊహించలేరు. అవన్నీ పగటి కలలే. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేయాలని కోరితే పెడర్థాలు తీస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. మమ్మల్ని అడిగి హామీలిచ్చారా..? అంటూ కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమ‌ని ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలిస్తాయా..? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగగడం లేదు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు పొందడం మా హక్కు అని అడిగితే చులకనగా మాట్లాడుతారా..? రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంటే, మౌనం వహించిన కిషన్‌రెడ్డి బాధ్యతా రాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం దురదృష్టకరం. రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రాలకు సహకరించాల్సిన కేంద్రం విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌, మెట్రో కోసం నిధులు కేటాయించమని కోరడం తప్పా..? అందుకు సహకరించాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బాధ్యతల నుంచి తప్పించుకుంటూ వ్యాఖ్యానిస్తున్నారని మండిప‌డ్డారు.

Also Read: Chalisa: ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ఈ చాలీసా పఠించండి!

హైదరాబాద్‌ నగరం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌ రెడ్డికి నగరాభివృద్ధిలో బాధ్యత లేదా..? రాష్ట్ర అభవృద్ధి కోసం గొంతెత్తడం బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలా..? ఒక రాష్ట్రంపై వివక్ష చూపుతూ తమకు కావాల్సిన రాష్ట్రాలకు అధికంగా ప్రాజెక్టులు, నిధులు కేటాయించే బీజేపీ వారికే తెలుసు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు. తాను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని కిషన్‌ రెడ్డి అన్నారు. మేము అదే చెబుతున్నాం. ఆయన ప్రజలకు జవాబుదారీగా ఉంటూ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయమని కోరుతున్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఎన్ని కేటాయించింది..? ఎన్ని ప్రాజెక్టులు కేటాయించింది..? రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రాజెక్టులు, సంస్థలకు ఎందుకు మెకాలడ్డుతోంది..? వీటిపై చర్చించేందుకు తెలంగాణ బీజేపీ సిద్దమా..? అని సవాలు విసురుతున్నామ‌న్నారు.