Kishan Reddy visit to the flood affected areas : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో మంత్రి పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) వెంట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై వరద వల్ల జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయం చేస్తామని ప్రకటించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ..
ఖమ్మం పట్టణంలోని ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా దంసలాపురంలో కిషన్ రెడ్డిని వరద బాధితులు అడ్డుకున్నారు. వరదలకు తాము సర్వం కోల్పోయినా.. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కిషన్ రెడ్డిని బాధితులు నిలదీశారు. తమ గోడును పట్టించుకునే వారే లేరని వాపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహిళలకు నచ్చజెప్పటంతో వారు శాంతించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని కిషన్ రెడ్డికి పొంగులేటి వివరించారు. ఈ మేరకు వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇండ్లు కట్టిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు..
మరోవైపు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురిశాయి. దీంతో మున్నేరుకు వరద ఉదృతి పెరిగింది. బయ్యారం, గార్ల చెరువులకు భారీగా వరదనీరు రావడంతో మున్నేరు, ఆకేరు భారీగా వరద పెరిగే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ మున్నేరు వైపు మార్గాలను మూసివేయాలని ఆదేశించారు. మున్నేరు వెంట నివసించే దన్వాయిగూడెం, రమణపేట్, ప్రకాశ్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర నగర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాల్లోకి వెళ్లాలని కోరారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరావస కేంద్రాన్ని పరిశీలించారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.