Diwali Greetings: కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు (Diwali Greetings) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రటకన విడుదల చేశారు. హిందూ బంధువులందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ కుటుంబానికి సుఖశాంతులను, సమృద్ధిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావణుడిని సంహరించిన తర్వాత విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకొనే దీపావళి పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అమావాస్య చీకటిలో దీపాల వెలుగులు విరజిమ్ముతున్నట్లే.. ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లోనూ నవ్య కాంతులు తీసుకురావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
అలాగే.. జీవితమంటేనే చీకటి వెలుగుల సమాహారం. దీపావళి నేర్పే పాఠం ఇదే. ప్రతి మనిషి జీవన ప్రయాణం అజ్ఞానాన్ని పారద్రోలే చైతన్యకాంతుల దిశగా సాగిపోవాలని, ఆత్మీయతలు, అనుబంధాల వేడుకగా జ్ఞానకాంతులు వెదజల్లే సందర్భంగా ఈ దీపావళి నిలిచిపోవాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Also Read: Mayonnaise: తెలంగాణలో మయోనైస్ వినియోగంపై నిషేధం.. మయోనైస్ తింటే నష్టాలివే!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ కోరారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరిసంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.