Site icon HashtagU Telugu

Amit Shah : తప్పుడు చరిత్రను మోడీ సరి చేస్తున్నారు : అమిత్‌ షా

Amit Shah

Amit Shah

Amit Shah : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పారామిలటరీ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. నిజాంపై తెలంగాణ ప్రజలు చేసిన అలుపెరుగని పోరాటం అనేది వారి అచంచల దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ విముక్తి కోసం అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. ‘‘సర్దార్ పటేల్ లేకపోతే.. ఆనాడు తెలంగాణ విమోచన సాధ్యమయ్యేది కాదు.  రజాకార్లతో పోరాడి అమరులైన యోధులకు నివాళులర్పిస్తున్నాం.  ఇవాళ ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవాదివస్‌ జరుపుకుంటున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ సర్కారు అధికారికంగా నిర్వహించడం లేదు.  తెలంగాణ చరిత్రను దాదాపు 75 ఏళ్ల పాటు కొందరు వక్రీకరించారు. మోడీ  ప్రధాని అయ్యాక ఆ తప్పుల్ని సరిచేశారు’’ అని అమిత్ షా వెల్లడించారు. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబరు 17ను తెలంగాణ సమైక్యతా దినోత్సవంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించడం సరికాదన్నారు. ఎంతో పోరాటం, బలిదానాలతో స్వేచ్ఛను పొందిన సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా చెప్పడమే కరెక్ట్ అవుతుందని తెలిపారు.

Also read : PM Modi Slept on Train Floor: ప్రధాని మోదీ టికెట్ ఉన్నప్పటికీ రైలులో కింద ఎందుకు పడుకున్నారో తెలుసా..!?

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల వారిని అమిత్ షా (Amit Shah) సన్మానించనున్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, వెచ్చిస్తున్న నిధులు, సాధించిన ప్రగతి వివరాలను ఆయన నివేదించనున్నారు. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాల నుంచి విముక్తికి సంకేతంగా.. ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మనదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ పోలోతో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయాడు. దీంతో తెలంగాణకు 13 నెలలు ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చింది.