ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీపైనా విరుచుకుపడ్డారు. కాగా, ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన రమేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. బీఈడీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.
సీఎం మాట్లాడుతుండగా కిరోసిన్ బాటిల్ తీసుకొచ్చి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే సభకు హాజరైన పోలీసులు మంటలను ఆర్పి సభ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవలే తన తల్లి మంచాన పడుతుండగా తండ్రి చనిపోయాడని, భార్యాపిల్లలను పోషించుకోలేక పోతున్నానని పోలీసులకు తెలిపాడు. అయితే ఉద్యోగం కోసం ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఉద్యోగం రాలేదని తెలుస్తోంది.