తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, ఉద్యోగ భర్తీ ప్రక్రియ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు దిగింది. ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని నిరుద్యోగులు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నోటిఫికేషన్లు జారీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
CM Chandrababu : భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష..రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి
ఈ నేపథ్యంలో శుక్రవారం వామపక్ష విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయం ముట్టడి(Telangana Secretariat)కి యత్నించారు. అయితే ముందస్తుగా దీనికి సిద్ధంగా ఉన్న పోలీసులు నిరుద్యోగులను అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో సచివాలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల నినాదాలు, పోలీసుల అప్రమత్తత మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ట్రాఫిక్ కూడా తీవ్రంగా నిలిచిపోయింది.
న్యాయం కోసం ప్రశాంతంగా పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం తగదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దాంతో, మళ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్న ప్రతి విడత నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటూ అరెస్టు చేస్తుండటంతో ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరుద్యోగ జేఏసీ తదుపరి కార్యాచరణపై చర్చలు ప్రారంభించింది.