Talasani: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా శుక్రవారం రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల జబ్బార్ కాంప్లెక్స్ వద్ద జరిగిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50 సంవత్సరాల లో జరగని అభివృద్ధి ని BRS ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి గా KCR నాయకత్వంలోనే జరిగిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో తాము పని చేశామని అన్నారు. సికింద్రాబాద్ నుండి MP గా గెలిచి కేంద్రమంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి తనను గెలిపించిన ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటేనే హిందువు అవుతారా అని ప్రశ్నించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో తాను నిర్మించినన్ని దేవాలయాలు ఎవరు నిర్మించలేదని చెప్పారు. ఏ ఆపద వచ్చినా.. ఎలాంటి సమయంలో నైనా అండగా ఉంటూ వచ్చామని గుర్తు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.