Revanth Promises: అదుపులేని రేవంత్ హామీలు ! జోడో జోరు!!

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 04:42 PM IST

హాత్ సే హాత్ జోడో యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి రోజు ఒక హామీ ఇస్తూ ప్రాంతీయ పార్టీలను మించి పోతున్నారు. ఏఐసీసీ అనుమతి లేకుండా ఆయన చేస్తున్న హామీలపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే రూ.2లక్షలు రైతులకు రుణమాఫీ అని తేల్చిన రేవంత్ మరిన్ని హామీల్ని ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చినంతనే రూ.500లకు గ్యాస్ సిలిండర్ సొంతింటి నిర్మాణానికి రూ.5లక్షలు సాయం.. ఆరోగ్య శ్రీలో రూ.5లక్షల విలువైన వైద్య చికిత్సలు అందేలా చూడటం.రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలుతో పాటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇదే ఒరవడితో వెళితే తన పాదయాత్ర ముగిసే నాటికి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమయ్యేలా చూడటంతో పాటు.. ప్రజలు సైతం తమ హామీల్ని రిజిస్టర్ చేసుకునేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారు. మరి.. ఈ విషయంలో ఆయన ఏమేరకు విజయం సాధిస్తారు? అనేది పెద్ద ప్రశ్న.

తన పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాలకు ఇస్తున్న హామీలు జాబితా అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పాదయాత్రలో భాగంగా మొదటి రోజు నుంచి ఇప్పటివరకు రేవంత్ నోటి నుంచి వస్తున్న హామీల్ని చూసినప్పుడు.. ఆచితూచి అన్నట్లుగా ఆయన హామీలు ఉన్నట్లుగా చెప్పాలి. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ పేరుతో మొదలైన ఆయన హామీలు.. ఇప్పుడు మరిన్ని వచ్చి చేరాయి. తాజాగా గ్యాస్ బండ ధర ఒక్కింటికి రూ.50 చొప్పున పెంచటం.. గడిచిన రెండేళ్లలో నాలుగు వందల రూపాయిలు పెంచేసిన నేపథ్యంలో.. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గ్యాస్ బండను రూ.400లకు అమ్మేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల రూపురేఖల్ని మార్చాలన్న పట్టుదలతో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అందుకు తగ్గట్లే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా.. ఆయన నిర్వహిస్తున్న “యాత్ర”లో ఎప్పటికప్పుడు కొత్త హామీల్ని ఇస్తూ.. పాత హామీలను అదే పనిగా ప్రస్తావిస్తూ ముందుకు వెళుతున్న ఆయన తీరుపై సంత్రప్తి వ్యక్తమవుతోంది. తాను ముసలోడిని అయినట్లుగా కేసీఆర్ నోటి నుంచి మాట వచ్చినంతనే.. పదునైన పంచ్ వేసిన రేవంత్ వేసిన కౌంటర్ కేసీఆర్ అండ్ కోను ఆత్మరక్షణలో పడేలా చేశాయని చెప్పాలి. అధిష్టానం ప్రకటించకుండానే సీఎం మాదిరిగా రేవంత్ ఫోకస్ అవుతున్నారు. ఏఐసీసీ ప్లీనరీ లోను సీఎం నినాదాలు వినిపోయించేలా చేసిన మొదటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఆయన నోటి నుంచి వస్తున్న మాటలకు హామీ ఎవరు? అనేది కాంగ్రెస్ సీనియర్లు కు కూడా అంతుపట్టడంలేదు.

Also Read:  Credit Card: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌ లను ఇలా ఉపయోగించుకోండి