Ukraine-Russia war: సింగరేణిపై ‘వార్’ ఎఫెక్ట్!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇతర దేశాలపై ప్రభావం చూపుతోంది.

  • Written By:
  • Publish Date - March 19, 2022 / 12:55 PM IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇతర దేశాలపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా భారతదేశానికి అమ్మోనియం నైట్రేట్ సరఫరా తగ్గిన నేపథ్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో బొగ్గు ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమ్మోనియం నైట్రేట్‌ను బొగ్గు గనుల తవ్వకాల్లో వినియోగించే పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. స్థానిక పేలుడు పదార్థాల తయారీదారులు ముడిసరుకు కొరతతో తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్, రష్యా, టర్కీ, బల్గేరియా, ఇతర దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతి పై ఎఫెక్ట్ పడింది. దీని ఫలితంగా సింగరేణిలో పేలుడు పదార్థాల సరఫరా తగ్గింది.

గనుల నుంచి ఓవర్‌బర్డెన్ తొలగింపు కోసం తయారీదారులు ప్రతిరోజూ 600 టన్నుల పేలుడు పదార్థాలను నిరంతరం సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఎస్‌సిసిఎల్‌కు ప్రస్తుతం ప్రతిరోజు సగటున 475 టన్నుల పేలుడు పదార్థాలు మాత్రమే సరఫరా అవుతున్నాయని, ఫలితంగా లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. వచ్చే రెండు నెలలకు నిర్దేశించిన 68 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతిరోజూ 14.8 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌బర్డెన్‌ను తొలగించేందుకు పేలుడు పదార్థాలు అవసరం. అయితే ఇండెంట్‌లో 80 శాతం పేలుడు పదార్థాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి.

తయారీదారులు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నందున, పేలుడు పదార్థాలను క్రమం తప్పకుండా సరఫరా చేయడానికి SCCL తాజాగా టెండర్లను పిలిచింది. SCCL డైరెక్టర్ (ఆపరేషన్స్) S చంద్రశేఖర్ మాట్లాడుతూ… తయారీదారులు సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పేలుడు పదార్థాలను సరఫరా చేస్తామని పదే పదే హామీ ఇచ్చారు. అయితే పలు సందర్భాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యారు. ఇది బొగ్గు సరఫరాలో 10 శాతం ఉత్పత్తిని ప్రభావితం చేసింది. పేలుడు పదార్థాల సరఫరాకు సంబంధించిన సమస్యను ఏప్రిల్ 15 నాటికి పరిష్కరించగలమని మేం ఆశిస్తున్నాం. ఎందుకంటే తయారీదారులు దాఖలు చేసిన టెండర్ల ప్రక్రియను మేము పూర్తి చేస్తాం. అని చంద్రశేఖర్ అన్నారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి, SCCL రామగుండం, మణుగూరులోని రెండు పేలుడు పదార్థాల తయారీ యూనిట్ల నుండి 200 టన్నుల పేలుడు పదార్థాలను కూడా కొనుగోలు చేస్తోంది. ఎనిమిది తయారీదారులు సరఫరా చేస్తున్న పేలుడు పదార్థాలకు ఇది అదనమని ఆయన చెప్పారు. పేలుడు పదార్ధాలు తగినంతగా సరఫరా అయ్యేలా SCCL యాజమాన్యం తయారీదారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు.