Ukraine crisis: మా సంగతేంటి.. స్వదేశానికి తర్వగా తరలించండి!

పేలుళ్ల శబ్దాలు.. క్షిపణుల దాడులు.. తుపాకల మోతతో భారతీయ విద్యార్థులు భయపడిపోతున్నారు.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 03:09 PM IST

పేలుళ్ల శబ్దాలు.. క్షిపణుల దాడులు.. తుపాకల మోతతో భారతీయ విద్యార్థులు భయపడిపోతున్నారు. అయితే యుద్ధం కారణంగా వైద్య విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేసేందుకు విద్యార్థులు తమ దాహం తీర్చుకునేందుకు మంచునీళ్లను తోడుకుంటున్న వీడియోలను గ్రూపుల్లో షేర్ చేశారు. అక్కడి యూనివర్సిటీ, బంకర్లలో ఉంటున్న విద్యార్థుల అవసరాల నిమిత్తం రెండు, మూడు వాటర్ ట్యాంక్ లు వచ్చాయి. అవి కేవలం తాగునీటికి కూడా సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమ వసతి గృహంలోని టెర్రస్‌పై మంచు కరుగుతున్న పైపుల నుండి నీటిని ఎలా సేకరిస్తున్నారో చూపించే వీడియోలను షేర్ చేశారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం తప్ప మరో మార్గం లేదని ఆందోళన తెలిపారు.

ఉక్రెయిన్ లోని సుమీ నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ శ్రీనాథ్ అనే విద్యార్థి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. “యూనివర్సిటీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మాకు తిండి లేదు. కరెంటు, నీళ్లు లేవు’’ అన్నారు. విద్యార్థులకు ఇంటర్నెట్‌ సమస్య కూడా ఎదురవుతోంది. బతకడం కష్టంగా మారిందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా సుమీలోని యూనివర్సిటీకి చెందిన హాస్టళ్లలో చిక్కుకున్న వందలాది మంది విద్యార్థుల పరిస్థితులు, వారు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను లను మహతాబ్ అనే విద్యార్థి వీడియోలు తీస్తూ వివరిస్తున్నాడు.

తెలంగాణకు చెందిన విద్యార్థి నిజాముద్దీన్ విద్యుత్, నీటి సరఫరాలో అంతరాయం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను తన కుటుంబానికి తెలియజేశాడు. “మా సంగతేమిటి? ఆహారం, నీరు, ప్రాథమిక అవసరాల కోసం ఎటువంటి వనరులు లేకుండా బంకర్లలో అసౌకర్యంగా రాత్రులు గడిపుతున్నాం. ఇకనైనా మా గురించి ఆలోచించండి? మేం ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని పేలుళ్లు సంభవిస్తాయో తెలియదు’’ అని బోరుమంటున్నాడు.