Raja Singh : ఎన్నికల వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. రాజాసింగ్‌కు ఈ కేసులకు సంబంధించిన నోటీసులను జారీ చేసిన పోలీసులు.. వాటిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘దాండియా ఈవెంట్ కు వచ్చే వారందరి గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలి. ఈ ఈవెంట్ కోసం ఓ వర్గానికి చెందిన బౌన్సర్లు, డీజే ఆర్టిస్టులను రప్పిస్తే దాడులు చేస్తాం’’ అని ఆయన అన్నట్లుగా ఒక వీడియో ప్రూఫ్ పోలీసులకు దొరికిందని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసును రాజాసింగ్‌పై నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతోపాటు దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కత్తులు, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించారు. దీనిపైనా అప్పట్లో పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ‘‘ఆయుధ పూజ సందర్భంగా రాజాసింగ్ ప్రదర్శించిన తుపాకులు రాజాసింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందివి. వాటిని రాజాసింగ్ ప్రదర్శించడం నిషేధం. పోలీసుల వెపన్స్ తో పాటు కత్తులను ప్రదర్శించడం చట్ట విరుద్ధం’’ అని పేర్కొంటూ సమద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీన్ని స్వీకరించిన మంగళ్ హాట్ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. తాజాగా పోలీసులు అందించిన నోటీసుల వ్యవహారంపై రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని(Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు.