Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. పసికందు మృతి..!

  • Written By:
  • Publish Date - March 18, 2022 / 12:13 PM IST

హైదరాబాద్ మ‌హా నగరంలో గురువారం రాత్రి ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్ర‌మంలో అప్పుడే రోడ్డు దాటుతున్న యాచ‌కులను ఢీకొట్ట‌డంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మ‌రో చిన్నారి, ఇద్ద‌రు మ‌హిళ‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 8 గంటల సమయంలో టీఆర్ నంబర్ ఉన్న మహేంద్ర థార్ కారు మాదాపూర్ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45లోకి వచ్చింది. రోడ్ నంబర్ 1/45 కూడలిలో అతివేగంగా రావడంతో అదుపుతప్పింది.

ఆ సమయంలో అక్కడే బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహన్, సారిక చౌహన్, సుష్మ బొంస్లేలను ఢీ కొట్టింది. కాజల్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు, సారిక చేతిలో ఉన్న ఏడాది వయసున్న బాలుడు కిందపడిపోయారు. చిన్నారులను ఎత్తుకున్న మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును నడుపుతూ వచ్చిన వ్యక్తి దానిని అక్కడే వదిలేసి పారిపోయాడు.

ఇక గాయపడిన చిన్నారులను, మహిళలను పోలీసులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వారిలో రెండున్న‌ర నెల‌ల పసికందు రణవీర్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయినట్టు అక్క‌డి వైద్యులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక మ‌రోవైపు కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిందని.. ఆ కారుకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్‌లో ఉన్నానని, తాను మీర్జా అనే ఫ్రెండ్‌కు స్టిక్కర్ ఇచ్చానని, అది అతనికి సంబంధించిన కారు కావొచ్చు అని బోధన్ ఎమ్మెల్యే చెప్పారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలస్తుందన్నారు.