Site icon HashtagU Telugu

Drugs : హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారులు అరెస్ట్

Drugs

Drugs

హైదరాబాద్‌లో డ్ర‌గ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతుంది. ప్ర‌తి రోజు ఏదో ఓ చోట డ్ర‌గ్స్ దొరుకుతునే ఉంది. పోలీసులు నిఘా పెట్టిన‌ప్ప‌టికి డ్రగ్స్ స‌ర‌ఫ‌రా హైద‌రాబాద్‌కు చేరుతుంది. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర డ్ర‌గ్స్ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి హెరాయిన్, ఎండీఎంఏ, సహా నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాపై సమాచారం అందుకున్న పోలీసు బృందాలు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌, ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ రాకెట్లను ఛేదించారు. ఇద్దరు డ్రగ్స్‌ వ్యాపారులను పట్టుకున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. పక్కా సమాచారంతో ఆగస్ట్ 8న ఒక నిందితుడిని పోలీసు బృందాలు పట్టుకుని అతని వద్ద నుంచి 70 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల MDMA, ఇత‌ర వ‌స్తువుల‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.

నిందితులు రాజస్థాన్‌లోని ఓ డ్రగ్‌ సరఫరాదారు నుంచి గ్రాము రూ.5,000 నుంచి రూ.6,000 చొప్పున కొనుగోలు చేసి కొరియర్‌ సర్వీసుల ద్వారా హైదరాబాద్‌కు రవాణా చేయడంతోపాటు ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు బట్టల్లో దాచి తీసుకువ‌చ్చేవారు. నిషేధిత పదార్థాలను గ్రాము రూ.8,000 నుంచి రూ.10,000 వరకు వినియోగదారులకు విక్రయించారని, నిందితులు ఆ డ‌బ్బుల‌తోనే జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. మ‌రో కేసులో.. పోలీసు బృందాలు ఓ ఇంటిపై దాడి చేసి, అతని వద్ద నుండి 2.25 కిలోల డ్ర‌గ్స్‌ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలించి నగరంలోని ప్రజలకు 10 గ్రాములు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.