Cabinet Expansion: తెెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ (గురువారం) పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. జంతర్ మంతర్‌లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను సోనియాకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
Also Read :Mohammed Shami: పనిచేయకుండానే ‘ఉపాధి హామీ’ శాలరీలు.. షమీ సోదరి అత్తే సూత్రధారి
తప్పకుండా ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు : టీపీసీసీ చీఫ్
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)లో భాగంగా బీసీలకు మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరామని టీపీసీసీ చీఫ్ మహేశ్ చెప్పారు. తప్పకుండా ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నారు.బీసీలకు మంచి చేసిన ఘనత కాంగ్రెస్‌దే అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ చేస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం. వారే తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ‘‘మా అభిప్రాయాలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తీసుకున్నారు. తగిన సమయంలో మంత్రి వర్గ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆయన వెల్లడించారు.
బీజేపీ నేతలే మోడీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి
ఇవాళ సాయంత్రంకల్లా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిని కలుస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసే అవకాశం లేదన్నారు. బీజేపీ నేతలు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ను తీసుకుంటే, తాము భేషజాలు లేకుండా వారితో కలిసి వెళ్తామని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ‘‘మేం తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు ఎవరికీ ఇవ్వడం లేదు. ముస్లింలు ఈ దేశంలో భాగం కాదా ? ముస్లింలు బీసీల్లో ఉన్నారు. దానిలో భాగంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చాం’’ అని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ‘‘గుజరాత్‌లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మోడీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అమల్లో ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.