ఇద్ద‌రు మొన‌గాళ్లు ..వైట్ ఛాలెంజ్ నాట‌కంలో బూట‌కం

  • Written By:
  • Updated On - September 20, 2021 / 02:16 PM IST

వైట్ ఛాలెంజ్ లో రేవంత్ , కేటీఆర్ ల‌లో ఎవ‌‌రు నెగ్గారు? ఎవ‌రు ఓడారు? ఎవ‌రి వ్యూహంలో ఎవ‌రు ప‌డ్డారు? వాళ్లిద్ద‌రూ గోడ మీద పిల్లుల్లా ఎలా జారుకున్నారు?.. ఇవీ, ఇప్పుడు సామాన్యుల ముందుకు మెదులుతున్న ప్ర‌శ్న‌లు. నాట‌కీయంగా ఇరువురి రాజ‌కీయాన్ని రెండు రోజులుగా న‌డిపారు. ఛాలెంజ్ విసిరిన రేవంత్ టైం ప్ర‌కారం అనుచ‌రుల‌తో గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు చేరుకుని ర‌క్తిక‌ట్టించారు. వైట్ ఛాలెంజ్ ను స్వీక‌రిస్తూనే..రాహుల్ ను టార్గెట్ చేసి..కేటీఆర్ జారుకున్నాడు.

ఓటుకు నోటు కేసులో లై డిటెక్ట‌ర్ ఛాలెంజ్ ను కేటీఆర్ విసిరాడు. దాన్ని స్వీక‌రిస్తూనే…కేసీఆర్ ను రేవంత్ టార్టెట్ చేశాడు. చివ‌ర‌కు ఇద్ద‌రూ ఛాలెంజ్ ల‌కు సిద్ద‌ప‌డ‌కుండా నై స్ గా జారుకోవ‌డం హైలెట్.
రాహుల్ గాంధీతో కేటీఆర్ త‌న రాజ‌కీయ జీవితాన్ని పోల్చుకున్నాడు. ఆ స్థాయి లీడ‌ర్ గా భావిస్తున్నారు. అందుకే, ఆయ‌న రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్ కి రాహుల‌ను ప్ర‌స్తావించారు. వాస్తవంగా రాహుల్ నేష‌న‌ల్ లీడ‌ర్. ఆయ‌న గాంధీ కుటుంబం నుంచి వ‌చ్చిన రాజకీయ నేప‌థ్యం ఉంది. కేటీఆర్ ఒక ఉప ప్రాంతీయ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఆయ‌న్ని రాజ‌కీయ స‌రిజోడిగా రేవంత్ భావించాడు. అందుకే, వైట్ ఛాలెంజ్ విసిరాడు. కానీ, రాహుల్ తో కేటీఆర్ పోల్చుకుని చాలా తెలివిగా ఛాలెంజ్ ను ఢిల్లీ వైపు పంపాడు.

రేవంత్ చాలా చాకచ‌క్యంగా రాజ‌కీయ నాట‌కాన్ని న‌డిపారు. వారం రోజులుగా ట్విట్ట‌ర్ వేదిక‌గా చేల‌రేగిపోతోన్న కేటీఆర్ ను టార్గెట్ చేశాడు. శ‌శిథ‌రూర్ కు క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు రేవంత్ ను ల‌క్ష్యంగా చేసుకున్నాడు కేటీఆర్. ఆ క‌సితో కేటీఆర్ ను వైట్ ఛాలెంజ్ రూపంలో ముగ్గులోకి దింపాల‌ని రేవంత్ వ్యూహం ర‌చించాడు. అందుకు గ‌జ్వేల్ స‌భ‌ను వేదిక‌గా మ‌లుచుకున్నాడు. ఆ వేదిక‌పై నుంచి లిక్క‌ర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ కేసీఆర్, డ్ర‌గ్స్ అంబాసిడ‌ర్ కేటీఆర్ అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించాడు. అందుకు ర‌గిపోయిన కేటీఆర్ విలేక‌రుల చిట్ చాట్ లో రెచ్చిపోయాడు.
వాల్ పోస్ట‌ర్లు, గోడ‌ల‌కు సున్నం కొట్టుకునే వాళ్ల‌కు నాలుగు ఇళ్లు జూబ్లీహిల్స్ లో ఎలా వ‌చ్చాయ‌ని రేవంత్ ను టార్గెట్ చేశాడు. అంతేకాదు, దందాల చిట్టా ఉంద‌ని, బ‌ట్ట‌లూడ‌దీసి న‌డిరోడ్డు మీద నిల‌బెడ‌తాన‌ని హెచ్చ‌రించాడు. ఓటుకు నోటు కేసులో దొంగ అంటూ విరుచుకుప‌డ్డారు. రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చాడు. వెంట‌నే రేవంత్ మ‌రింత రెచ్చిపోయాడు. వైట్ ఛాలెంజ్ ను విసిరాడు. ఇక అక్క‌డ నుంచి ఇరువురి మ‌ధ్య ట్వీట్ల వార్ హీటెక్కింది.

స‌రిగ్గా మ‌ధ్నాహ్నం 12 గంట‌ల‌కు గ‌న్ పార్కు వ‌ద్ద‌కు రేవంత్ త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చాడు. ఛాలెంజ్ ను స్వీక‌రించాల‌ని మ‌రోసారి కేటీఆర్ కు స‌వాల్ చేశాడు. ఒక వైట్ ఛాలెంజ్ ను స్వీక‌రించ‌క‌పోతే, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఉన్న‌ట్టేన‌ని టార్గెట్ చేశాడు. ఓటుకు నోటు కేసులో దొంగ చేసిన ఛాలెంజ్ ను తీసుకోనంటూ కేటీఆర్ ట్వీట్ చేశాడు. పైగా లీగ‌ల్ గా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. ప‌రువు న‌ష్టం దావా వేస్తున్నాన‌ని రేవంత్ గురించి మ‌రో ట్వీట్ కేటీఆర్ చేశాడు. దీంతో ఇక కేటీఆర్ గ‌న్ పార్కు వ‌ద్ద కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని భావించిన రేవంత్ అనుక‌న్న పొలిటిక‌ల్ మైలేజి సాధించిన‌ట్టు భావిస్తున్నారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఎవ‌రు నెగ్గారు అంటే…ఎవ‌రికి వారే జారుకున్నారు. టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా వైట్ ఛాలెంజ్ ను ఒక‌రు కోర్టుకు పంపిస్తే, మ‌రొక‌రు లైడిక్ట‌ర్ ఎక్కించారు. తెలివిగా ఇద్ద‌రూ వాళ్లు విసిరిన ఛాలెంజ్ ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించి మీడియాను బ‌క‌రా చేశారు. ప్ర‌జ‌ల్ని అమాకుల్ని చేశారు. రేవంత్, కేటీఆర్ ఇద్ద‌రూ నెగ్గారు. మీడియా, ప్ర‌జ‌లు మాత్రం ఓడిపోయారు. ఇదీ లాజిక‌ల్ పాలిటిక్స్ ఎండింగ్‌. ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటిని భ‌విష్య‌త్ లో చూడాలో..మ‌రి.!