Site icon HashtagU Telugu

TTDP : చంద్ర‌బాబు నిజామాబాద్ స‌భ‌, కాసాని బ‌స్సు యాత్ర‌!

Ttdp

Ttdp

ఖ‌మ్మం స‌భ ఇచ్చిన `కిక్`నిజామాబాద్ వైపు తెలంగాణ టీడీపీని(TTDP) చూసేలా చేసింది. జ‌న‌వ‌రి మూడో వారంలో అక్క‌డ స‌భ పెట్ట‌డానికి సిద్ధం అయింది. ఆ పార్టీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ దూకుడుగా వెళుతున్నారు. నిజామాబాద్(Nizamabad) స‌భ‌ను హిట్ చేయ‌డానికి అనువైన ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేస్తున్నారు. ఆయ‌న అధ్య‌క్షుడు అయిన త‌రువాత పెట్టిన ఖ‌మ్మం స‌భ అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. ఆ స‌భ‌లో తెలంగాణ రాజ‌కీయ ఈక్వేష‌న్లు మార‌తాయ‌ని వారం రోజుల పాటు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగాయి. హైదరాబాద్ లో జ‌రిగిన బీజేపీ కీల‌క స‌మావేశంలోనూ టీడీపీ తెలంగాణ విభాగం(TTDP) దూకుడును చ‌ర్చించింది.

తెలంగాణ‌లో టీడీపీ దూకుడు(TTDP)

ఏపీలో పొత్తు కోసం మాత్ర‌మే తెలంగాణ‌లో టీడీపీ దూకుడుగా వెళుతుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. కానీ, స‌ర్వేల ప్ర‌కారం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ క‌నీసం 10 నుంచి 15 స్థానాల వ‌ర‌కు న‌ష్ట‌పోతుంది. అందుకే, ఆ పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఫేస్ చేయాల‌ని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు, తెలంగాణ వ్యాప్తంగా స‌భ‌లు పెట్ట‌డం ద్వారా పార్టీ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో బ‌ల‌ప‌డే కొద్దీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మీద దెబ్బ‌ప‌డ‌నుందని అంచ‌నా. ఆ ప‌రిణామం కాంగ్రెస్ పార్టీకి క‌లిసొస్తుంద‌ని అంచ‌నా. పైగా చంద్ర‌బాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆయ‌న కూడా మ‌రోసారి టీడీపీ, కాంగ్రెస్ పొత్తు మీద ఆశ‌లు పెట్టుకున్నారు.

Also Read : TTDP: టీడీపీ లోకి మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్‌?

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అంచ‌నాలు తల్ల‌కిందులు చేసేలా టీడీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో చేతులు కాల్చుకున్న బీజేపీ ఇప్ప‌టికీ టీడీపీకి దూరంగా ఉండాల‌ని భావిస్తోంది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉంటే గ్రేట‌ర్ హైద‌రాబాద్ సింహాస‌నంపై బీజేపీ ఉండేది. అలాగే, హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ చేసుకున్న స్వ‌యంకృతాప‌రాధం దెబ్బ‌తీసింది. అప్పుడు జ‌రిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. అంతేకాదు, హుజూర‌నగ‌ర్‌, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా బీజేపీకి రాలేదు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉంటే మ‌రోలా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉండేవి. ఇవ‌న్నీ తెలిసి కూడా `ఇగో`తో టీడీపీని దూరంగా చేసుకోవాల‌ని `బండి` భావించ‌డం కాంగ్రెస్ పార్టీకి క‌లిసొచ్చే అంశం.

నిజామాబాద్ (Nizamabad) స‌భ‌కు ప్లాన్

పొత్తుల‌తో సంబంధం లేకండా పూర్వ వైభ‌వం కోసం టీడీపీ తెలంగాణ విభాగం పోరాటాల‌కు దిగుతోంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన ప‌రిణామం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే, అన్ని చోట్లా టీడీపీ ఇంచార్జిల‌ను నియ‌మించింది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కీల‌క లీడ‌ర్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తోంది. ప్ర‌ధానంగా సంస్థాగ‌తంగా అన్ని ప‌ద‌వుల్లోనూ 80శాతం బీసీలు ఉన్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల పార్టీగా ఫోక‌స్ అవుతోంది. ఆ క్ర‌మంలోనే ఖ‌మ్మం స‌భ సూప‌ర్ హిట్ అయింది. అదే త‌ర‌హాలో నిజామాబాద్ (Nizamabad) స‌భ‌కు ప్లాన్ చేస్తోంది.

Also Read : Jagan Break : వారాహి, యువ‌గ‌ళం పై జ‌`గ‌న్‌`! ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..బ్రేకేనా?

తెలంగాణ వ్యాప్తంగా నెల‌కు ఒక స‌భ చొప్పున రాబోవు రోజుల్లో నిజామాబాద్, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బ‌హిరంగ స‌భ‌ల‌ను ఖ‌మ్మం త‌ర‌హాలో విజ‌య‌వంతం చేయాల‌ని భావిస్తోంది. అందుకోసం, ఇప్ప‌టికే కొన్ని మీడియా సంస్థ‌ల మ‌ద్ధ‌తును కూడా కాసాని కూడ‌గ‌ట్టుకున్నారు. ప్ర‌త్యేకించి నిజామాబాద్ నుంచి ఎదిగిన జ‌ర్న‌లిస్ట్ లు కొంద‌రు ఇప్పుడు మీడియా సంస్థ‌ల ఓన‌ర్లుగా ఉన్నారు. మ‌రికొంద‌రు మీడియా సంస్థ‌ల‌ను మేనేజ్ చేసే స్థాయిలో ఉన్న‌ర‌ని టాక్‌. అందుకే, వాళ్ల మ‌ద్ధ‌తు కూడ‌దీసుకుని నిజామాబాద్ స‌భ‌ను అనూహ్యంగా విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది.

బ‌స్సు యాత్ర‌కు కాసాని జ్ఞానేశ్వ‌ర్ సిద్ధం

జ‌న‌వ‌రి మూడో తేదీన నిజామాబాద్ స‌భ ముగిసిన త‌రువాత బ‌స్సు యాత్ర‌కు కాసాని జ్ఞానేశ్వ‌ర్ సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌డానికి రూట్ మ్యాప్ త‌యారు చేశారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల ప్ర‌తినిధిగా గుర్తింపు ఉన్న ఆయ‌న బ‌స్సు యాత్ర ద్వారా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్నారు. ద‌క్షిణ తెలంగాణ‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. పూర్వ‌పు వైభ‌వం దిశ‌గా అడుగులు వేయ‌డానికి దూకుడుగా వెళుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స్థానిక స‌మస్య‌ల‌పై పోరాటానికి బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు. రాబోవు రోజుల్లో ఇత‌ర పార్టీ ల నుంచి కీల‌క లీడ‌ర్లు టీడీపీలో చేరే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద బీజేపీతో పొత్తుతో సంబంధం లేకుండా పూర్వ వైభ‌వం కోసం టీడీపీ వెళుతోంది. ఈ ప‌రిణామం బీఆర్ఎస్, బీజేపీకి మాత్రం ద‌డ‌పుట్టిస్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌.