Site icon HashtagU Telugu

BR Naidu – CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ BR నాయుడు

Br Naidu Cm Revanth

Br Naidu Cm Revanth

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు (BR Naidu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధి, ఆధ్యాత్మిక రంగంలో సహకారం, తదితర అంశాల గురించి చర్చ జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా, తిరుమల తిరుపతి దేవస్థానంతో సంబంధమున్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తన పూర్తి మద్దతు అందజేయనున్నట్లు వెల్లడించారు. బి.ఆర్. నాయుడు టీటీడీకి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తుల సేవల మెరుగుదలకై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లు వరుసపెట్టి టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ను కలుస్తున్నారు.

నిన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ సైతం కలిశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. బీఆర్ నాయుడుకు కేటీఆర్ శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి వారి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు లేఖల విషయమై విజ్ఞప్తి చేశారు. అలాగే, కరీంనగర్‌, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు వేగంగా పూర్త‌య్యేలా సహకరించాలని కోరారు.

BR నాయుడు విషయానికి వస్తే..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులైన సంగతి తెలిసిందే. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితమే. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు. బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చురుకుగా పని చేసి, 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు. బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగం తర్వాత ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత 2007లో టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.

Read Also :  Sleeper Class : ట్రైన్ లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా కూడా వాళ్లకు నిద్రపోయే ఛాన్స్ లేదా.. ఎందుకిలా..?