TSRTC: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు

  • Written By:
  • Publish Date - December 10, 2022 / 12:50 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 4233 ప్రత్యేక బస్సులను నడుపుతామని టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు మళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి సీజన్‌లో ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వీసీ సజ్జనార్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా కొన్ని మార్పులను ప్రకటించారు. గతంలో టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో 30 రోజుల ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ సౌకర్యం ఉండగా, ఇప్పుడు ఆ సమయాన్ని 60 రోజులకు పెంచారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు 60 రోజుల ముందుగానే టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Also Read: YSRCP: వైసీసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

గత ఏడాది సంక్రాంతి సందర్భంగా 3736 ప్రత్యేక బస్సులు మాత్రమే నడిచాయని, ఈసారి 10 శాతం బస్సులు పెంచామని వీసీ సజ్జనార్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సంక్రాంతికి ప్రకటించిన 4233 ప్రత్యేక బస్సుల్లో 585 బస్సులకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు.