దసరా సందర్బంగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది TSRTC . తెలంగాణ లో అతి పెద్ద పండగ దసరా (Dasara Festival). ఈ పండగ వస్తుందంటే చాలు ప్రపంచంలో ఎక్కడన్నా సరే తెలంగాణ ప్రజలు..తమ సొంతర్లకు వచ్చి పండగను జరుపుకుంటారు. ఈ తరుణంలో ప్రయాణకులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా TSRTC తో పాటు రైల్వే ప్రత్యేక సర్వీస్ లను ఏర్పాటు చేస్తుంది. ఈసారి కూడా అలాంటి ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఏర్పాటు చేస్తున్నట్లు TSRTC తెలిపింది. అలాగే ప్రత్యేక సర్వీస్ లలో ఎలాంటి అదనపు ఛార్జ్ వసూళ్లు చేయడం లేదని స్పష్టం చేసింది.
అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ (TSRTC) తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ బస్సులు నడవనున్నాయి. అక్టోబర్ 22వ తేదీన సద్దుల బతుకమ్మ, 23వ తేదీన మహార్ణవమి, 24వ తేదీన విజయదశమికి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం వల్ల ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఏసీ సహా అన్ని రకాల బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్స్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్ – ఉప్పల్, ఎంజీబీఎస్ – జేబీఎస్, ఎంజీబీఎస్ – ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనున్నారు.
అలాగే, అక్టోబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. పండుగ వేళ నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలను తీసుకోవడం జరుగుతుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయబోరని స్పష్టం చేసింది టీఎస్ఆర్టీసీ. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే తమ లక్ష్యం అని, అదనపు ఛార్జీలు తీసుకోబడవని ప్రకటనలో క్లియర్‌గా పేర్కొన్నారు.