TSRTC : పురుషులకు ప్రత్యేక బస్సులు.. ఇతర బస్సుల్లో 25 సీట్లు రిజర్వ్ ?

TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 06:52 AM IST

TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ సగటున 12 నుంచి 14 లక్షల మంది  మహిళలు ప్రయాణించేవారు. ఇప్పుడా సంఖ్య  29 లక్షలు దాటిందని ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో కండక్టర్లు ఈవిషయాన్ని ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. బస్సుల్లో నిలబడేందుకూ స్థలం లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. ఆర్టీసీ డిపోల మేనేజర్లు కూడా క్షేత్రస్థాయి పరిస్థితిని ఆర్టీసీ ఎండీకి  వివరించారు.ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, ఆయా టైమింగ్స్‌లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపే విషయంపై ఆర్టీసీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. బస్సుల్లో వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు చేస్తోంది. కొన్ని రూట్లలో స్టూడెంట్స్ కోసం కూడా స్పెషల్ బస్సులు నడపాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాకపోతే.. మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉందని అంటున్నారు

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో ఆర్టీసీ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న 2 వేల కొత్త బస్సుల్లో పురుషులకు ప్రత్యేకంగా సీట్లను రిజర్వ్ చేయించడంతో పాటు మహిళలకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి భావిస్తున్నట్టు తెలిసింది.  పురుషులు డబ్బులిచ్చి టికెట్ కొంటున్నా.. వారికి సీట్లు దొరక్కపోతే రానున్న రోజుల్లో పురుష ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆధారపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్టీసీకి నష్టం వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పురుష ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించినట్టుగా తెలిసింది. దీంతో ఆర్టీసి సైతం ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా పురుష ప్రయాణికులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుంది ? మహిళల కోసం ప్రత్యేక బస్సులను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది ? తదితర అంశాలపై ప్రయాణికులతో పాటు సిబ్బంది నుంచి ఆర్టీసీ  వివరాలు సేకరిస్తున్నట్టు  తెలిసింది. ఇందుకోసం బస్సులో ఉండే 55 సీట్లలో 25 సీట్లను పురుషులకు రిజర్వ్ చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈవిధంగా పురుషులకు సీట్లను రిజర్వ్ చేస్తే వ్యతిరేకత వస్తుందా? అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read: Sleeping Facts: నిద్రపోయిన తర్వాత శరీరంలో ఏమేం జరుగుతాయో తెలుసా?