Site icon HashtagU Telugu

TSRTC : త్వ‌ర‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం – టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

TSRTC

TSRTC

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) విజయవాడ రూట్‌లో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనుంది. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణీకులకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రెడిడ్ లైట్లు, భద్రత కోసం పానిక్ బటన్‌తో సహా హైటెక్ సౌకర్యాలను ఈ బ‌స్సుల్లో క‌ల్పించారు. ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప‌రిశీలించారు. సౌకర్యాలపై రాజీ పడవద్దని, వీలైనంత త్వరగా బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ అధికారులకు సూచించారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 41 సీట్ల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు ప్రయాణికుల భద్రత కోసం ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అదనంగా అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నిరోధించడానికి బస్సులలో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) ఏర్పాటు చేయబడింది. డ్రైవర్‌కు బస్సును సురక్షితంగా తిప్పడంలో సహాయపడేందుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా అమర్చబడింది. పర్యావరణ అనుకూల స్వభావం మరియు హైటెక్ ఫీచర్ల కారణంగా ఎలక్ట్రిక్ బస్సులకు పౌరుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని TSRTC MD సజ్జ‌నార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ బస్సులను అందజేస్తుందని.. వచ్చే నెలలోగా కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని TSRTC యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ AC బస్సుల ప్రారంభంతో, TSRTC తెలంగాణలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, స్థిరమైన రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.