Medaram Jatara 2024 : ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు చేసింది. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఎంతో నష్టపోతున్న ఆర్టీసీ.. కనీసం మేడారం జాతర స్పెషల్ బస్సులలోనైనా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం స్పెషల్ బస్సుల్లో మహిళల ఫ్రీ బస్ జర్నీ స్కీమ్‌ను అమలు చేయబోమని పేర్కొంటూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల భేటీ అయ్యారు. ఈసందర్భంగానే మహిళల ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ నుంచి మేడారం జాతర బస్సులకు మినహాయింపు కల్పించాలనే ప్రపోజల్‌ను తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు వినిపించారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగానూ స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీకి అవకాశం కల్పించారు. ఆదివాసీ, గిరిజన వర్గాలకు చెందిన మేడారం జాతర వేళ ఈ స్కీమ్ అమలును ఆపేస్తే.. ఆయా వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.
We’re now on WhatsApp. Click to Join.
మేడారం(Medaram Jatara 2024) స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆపేస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ అంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే సంస్థకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అయితే.. ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి తిరస్కరించారని సమాచారం. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలుచేయాల్సిందేనని, మేడారం సహా ఏ జాతరకు మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని భట్టి స్పష్టం చేశారు.
Also Read :Trump – 689 Crores : ఆమెకు 689 కోట్లు ఇవ్వండి.. ట్రంప్‌కు కోర్టు ఆదేశం
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఈ స్కీమ్స్‌ను ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియో గించుకుంటున్నారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీంను అమలు చేస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తుంది. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి.