Site icon HashtagU Telugu

100 Days – 150 Crores : 100 రోజుల్లో 150 కోట్ల ఆదాయమే టార్గెట్.. ఆర్టీసీ ప్లాన్ ఇదీ

TSRTC

100 Days – 150 Crores : పండుగల సీజన్ వేళ సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్నిఆర్జించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఫెస్టివల్ ఛాలెంజ్‌’ ను మొదలుపెట్టింది. దసరా నుంచి సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుంది. ‘ఫెస్టివల్ ఛాలెంజ్‌’ ను స్వీకరించాలంటూ డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదివారం లేఖలు రాశారు. సిబ్బంది కొరత ఉన్నందున.. పండుగల సీజన్ పూర్తయ్యేదాకా సెలవులు, వీకాఫ్‌లు తీసుకోకుండా పని చేయాలని కోరారు.  సెలవులు రద్దు చేసుకొని పని చేసే వాళ్లకు క్యాష్ అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు. రోజుకు కోటిన్నర రూపాయలు చొప్పున , వంద రోజుల్లో 150 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.

ప్రతిరోజు మరో లక్ష కిలోమీటర్లు టార్గెట్

వరుసగా పండుగలు (బతుకమ్మ, నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్మస్​, సంక్రాంతి) ఉన్నందున జనవరి 22 వరకు సాధ్యమైనన్ని ఎక్కువ కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రయత్నించాలని సజ్జనార్‌ కోరారు. తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం ప్రతిరోజు సగటున 32 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా.. దాన్ని ప్రతిరోజూ మరో లక్ష కిలోమీటర్ల మేర పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. తద్వారా  ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు మరింత పెరుగుతాయన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దసరా పండుగకు బస్సుల్లో జర్నీ చేసే ప్రయాణికులకు నగదు బహుమతి పొందే అవకాశాన్ని కూడా టీఎస్​ఆర్టీసీ  కల్పిస్తోంది. ఈ బహుమతి పొందాలంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల పూర్తి పేరు, ఫోన్ నంబర్​ని రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్​బాక్స్​లలో వేయాలి. దసరా పండుగ రోజు లక్కీ డ్రా తీసి గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తారు. మొత్తం 110 మందికి రూ.9900 చొప్పున బహుమతిగా (100 Days – 150 Crores) ఇస్తారు. ఈ నెల 21 నుంచి 23 వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.