TSPSC Exams Reschedule: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ (TSPSC Exams Reschedule) చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన చెందుతోందని, అందుకే ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రం లీకేజీలు, వివాదాలతో రాష్ట్రం అట్టుడికిన విషయం తెలిసిందే.
నివేదికల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.
Also Read: TSPSC : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్..?
ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్‌ను వేధిస్తున్న కీలక అంశాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఉద్యోగాల ఖాళీలు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కార్యాచరణ ప్రణాళికపై సవివరమైన నివేదికను సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. అన్ని TSPSC పరీక్షలను రీషెడ్యూల్ చేయడంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే చర్చలపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. సీఎం రేవంత్ తో సమీక్షా సమావేశం తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.