TSPSC Results : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసింది. రిజల్ట్స్‌కు సంబంధించిన మెరిట్ జాబితాలను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. వీటిలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు(TSPSC Results) ఉన్నాయి. ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 2022 సంవత్సరంలో నోటిఫికేషన్లు విడుదల చేయగా.. 2023 మే, జూన్, జులై నెలల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలో ఎంపికైన వారి సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రాతపరీక్షల ఫలితాల్లో జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనకు సంబంధించిన నిబంధనలలో టీఎస్‌పీఎస్సీ పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబరు 20 జారీచేసిన మార్గదర్శకాలకు కొన్ని సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులను సాధించినపుడు ర్యాంకుల ఖరారులో అవలంబించాల్సిన విధానంపై ఈ సవరణలలో టీఎస్‌పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.
Also Read : INSAT-3DS Launch Today: నేడు నింగిలోకి GSLV-F14.. ఈ రాకెట్ ప్రత్యేకతలివే..!
టీఎస్‌పీఎస్సీ మార్గదర్శకాలివీ..
- టీఎస్‌పీఎస్సీ పరీక్షలో ఇద్దరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులొస్తే.. అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. స్థానికులకు ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు ఆ తర్వాతి ర్యాంకు కేటాయిస్తారు.
- అభ్యర్థుల మార్కులు, స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ వయసు కలిగిని అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు.
- అభ్యర్థుల మార్కులు, స్థానికత, పుట్టినతేదీ సమానంగా ఉంటే జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు.
- అన్ని కేటగిరీల్లోనూ సమానంగా ఉంటే… ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హత(డిగ్రీ, డిప్లొమా, పీజీ ఇలా..) పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంకు ఇస్తారు. (గతంలో పాసైన తేదీ కాకుండా పాసైన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధన ఉండేది)
- అప్పటికీ అన్ని రంగాల్లో సమానంగా ఉంటే.. ఆ అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటైల్ సాధించిన వారికి ఉన్నత ర్యాంకు కేటాయిస్తారు.
- పర్సంటైల్ మార్కులు ఇద్దరి కన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఉన్నత విద్యార్హతను పరిగణనలోకి తీసుకుంటారు.
- అప్పటికీ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమానంగా ఉంటే వారివారి ఉన్నత విద్యార్హతలలో పాసైన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు.
- అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందికి సమాన మార్కులు వస్తే.. టీఎస్పీఎస్సీ నిర్ణయమే ఫైనల్.