Site icon HashtagU Telugu

Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్..!

Cropped (2)

Cropped (2)

ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్‌రావు గుడ్‌న్యూస్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా మార్పులు చేసినట్లు చెప్పారు. అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని ఆరోపించారు.

పోలీస్ ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ఫిజికల్ టెస్ట్ అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలని, పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు కేసీఆర్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే.. ఒక ప్రజాప్రతినిధిగా అదే మాకు నిజమైన ఆనందమని చెప్పారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తూ.. అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్యగా కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు.

త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించనున్నదని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులకు ఆదివారం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. మంత్రి చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహదారుఢ్య శిక్షణ శిబిర తరగతుల కసరత్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, వాటిలో 17 వేలు పోలీసు ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు.

త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయనున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.