TSPS : పేప‌ర్ లీక్ ర‌గ‌డ‌, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై విప‌క్ష దుమారం

పేప‌ర్ లీక్ (Paper leak) వెనుక ఎవ‌రు ఉన్నారు? ఉద్యోగుల‌కు పేప‌ర్ లీకు సాధ్య‌మా?

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 01:30 PM IST

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ (TSPS) త‌యారు చేసిన పేప‌ర్ లీక్ (Paper leak) వెనుక ఎవ‌రు ఉన్నారు? సాదాసీదా ఉద్యోగుల‌కు పేప‌ర్ లీకు సాధ్య‌మా? ప్ర‌భుత్వం పెద్ద‌లు కొంద‌రు ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఉన్నారా? ఉంటే ఎవ‌రు వాళ్లు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డంలేదు. సాక్షాత్తుగా టీఎస్పీఎస్ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ పేప‌ర్ లీకు వెనుక పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని విద్యార్థి సంఘాలు, విప‌క్ష నేత‌ల అనుమానం. ఎందుకంటే, ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంగానీ, ఎస్పీఎస్ గానీ అధికారికంగా పేప‌ర్ లీకు మీద ఫిర్యాదు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

పేప‌ర్ లీకు వెనుక పెద్ద‌ల హ‌స్తం (TSPS)

తెలంగాణ పోలీస్ సుమోటోగా ఈ కేసును విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న రిక్రూట్‌మెంట్ల కోసం ఏర్పాటు చేసిన ప్రశ్నపత్రాల లీక్‌లో (Paper leak) సూత్ర‌ధారులుగా భావిస్తూ తొమ్మిది మందిని అరెస్టు చేసింది. వాళ్ల‌లో ఇద్ద‌రు టీఎస్పీఎస్ (TSPS) ఉద్యోగులు, ఒక పోలీసు కానిస్టేబుల్ ఉన్న‌ట్టు గుర్తించారు.టిఎస్‌పిఎస్‌సి అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) నుండి మార్చి 11న బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (నైరుతి హైదరాబాద్) కిరణ్ ఖరే ప్ర‌క‌టించారు. ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్ కుమార్ 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఏడాది నవంబర్ నుంచి అట్ల రాజశేఖర్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు.

అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ హిందీ టీచర్‌ రేణుక, ఆమె భర్త లవ్‌ద్యావత్‌ దాఖ్యలు క‌లిసి ప్రవీణ్ ద్వారా ప్రశ్నాపత్రాలు లీక్‌ (Paper leak) చేశార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా తేల్చారు. అందుకు రూ.10 లక్షల డీల్ కుదిరింద‌ట‌. దీంతో డేటాను దొంగిలించి, దానిని పెన్ డ్రైవ్‌కు బదిలీ చేసి అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్ట్ కోసం ప్రశ్నపత్రాల ప్రింట్‌లను తీసుకొని మార్చి 2 న జనరల్ స్టడీస్ పేపర్‌ను పంచుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు.దీనికి ముందు, రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేవారి కోసం ప్ర‌య‌త్నించారు. ఆ క్ర‌మంలో రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న మేడ్చల్ పోలీసు కానిస్టేబుల్ కేతావత్ శ్రీనివాస్‌ను సంప్రదించాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఆసక్తి చూపకపోవడంతో నిందితులు వారి నుంచి రూ.13.5 లక్షలు తీసుకున్నారు. ధాక్యా, రాజేశ్వర్‌లు నీలేష్ మరియు గోపాల్‌లకు ప్రశ్నపత్రాన్ని అందించారని, వారిని ఇళ్లకే పరిమితం చేసి, మార్చి 5న పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారని పోలీసులు కనుగొన్నారు.

Also Read : TSPSC Paper Leak: దుమారం రేపుతున్న పేపర్ లీక్.. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం

నీలేష్ సోదరుడు రాజేందర్ నాయక్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు, అతని సోదరుడు లీకైన ప్రశ్నాపత్రాన్ని (Paper leak) కొనుగోలు చేయడానికి డబ్బును ఏర్పాటు చేశాడని ఆరోపించిన పోలీసులు మొత్తం తొమ్మిది మంది నిందితులపై వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఇదంతా పోలీసుల చెబుతోన్న వివ‌రాల ప్ర‌కారమే. కానీ, విప‌క్షాలు, విద్యార్థి సంఘాల నేత‌లు మాత్రం మ‌రో విధంగా అనుమానిస్తున్నారు. మొత్తం టీఎస్పీఎస్ లో(TSPS) 400 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ, 80 మంది మాత్ర‌మే ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్నారు. వాళ్ల‌లో అడ్మినిస్ట్రేష‌న్ కు సంబంధించిన వాళ్లు 20 మంది వ‌ర‌కు మాత్ర‌మే ఉంటారు. వాళ్ల‌తో ప్ర‌భుత్వం పెద్ద‌లు కొంద‌రు కుమ్మ‌క్కై ఈ పేప‌ర్ లీకు చేశార‌ని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం మీద సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు విప‌క్ష నేత‌లు, విద్యార్థి లీడ‌ర్లు సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నారు.

సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్

ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్పుడు పేప‌ర్ లీకు(Paper leak) అయిన వెంట‌నే సంబంధిత మంత్రి రాజీనామా చేయ‌డం చూశాం. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వాలు ప‌డిపోయిన దాఖ‌లాలు ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం ఏర్ప‌డిన కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో పేప‌ర్ లీకులు ప‌లు సంద‌ర్భాల్లో జ‌రిగాయి. ఇంట‌ర్ ప‌రీక్ష ప‌త్రాలు, ఎంసెట్ ప్ర‌శ్నా ప‌త్రాలు లీకైన సంద‌ర్భాల్లు ఉన్నాయి. వాటి మీద విప‌క్షాలు ప‌లు విధాలుగా పోరాటం చేసిన‌ప్ప‌టికీ విచార‌ణ‌కు ఆదేశించలేదు. పేప‌ర్ లీకుల కార‌ణంగా విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంద‌ర్భాల్లు కూడా అనేకం. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఏ మాత్రం చ‌ల‌నం లేదు. ఇప్పుడు ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPS)త‌యారు చేసిన పేప‌ర్ లీకైన సంద‌ర్భంగా ప్ర‌భుత్వం నుంచి ఆశించిన స్పంద‌న రాక‌పోవ‌డం విప‌క్షాల అనుమానాల‌కు బ‌లం చేకూరుతోంది.

Also Read : TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్.. 11 మంది అరెస్ట్