బీజేపీపై వరుసగా ప్రతీ అంశంలోనూ విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. మరో అంశంలోనూ బీజేపీని అపోజ్ చేయాలని డిసైడయ్యారు. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ (One Nation One Registration Plan) ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ మోడీకి లేఖ రాయాలని చూస్తున్నారు కేసీఆర్. రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఈ ప్లాన్ వల్ల కోల్పోతాయన్నది కేసీఆర్ అభిప్రాయం. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం రాష్ట్ర ఆదాయానికి ఆయువుపట్టులాంటిదని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జులై 2021న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఆ తర్వాత జులై 2021, ఫిబ్రవరి 1న రెండు సార్లు భూముల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ నిర్ణయాధికారం కేంద్రానికి ఇస్తే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కోల్పోతుందన్నది కేసీఆర్ భయం.
జులై 2017లో జీఎస్టీ (Goods and Service Tax) అమలులోకి వచ్చిన తర్వాత నుండి ఆల్కహాల్‌తో పాటు మరికొన్నిటిపై సేల్స్ టాక్స్, వ్యాట్ (Sales Tax, Vat) వేసే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోయాయి. కట్టించుకున్న జీఎస్టీ నుంచి తమకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఆదాయం కోసం చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఎదురుచూస్తున్నాయి. ప్రతీ ఏటా తెలంగాణ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ (Stamp Duty, Registration) ద్వారా 12వేల కోట్ల ఆదాయం పొందుతోంది. ఛార్జీల పెంపు తర్వాత అది 15వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ అన్నా మోడీ అన్నా అంతెత్తున లేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనపై కూడా గట్టిగా తమ గళాన్ని వినిపించాలని కేసీఆర్ ఆలోచన.