TS RTC : టీఎస్ ఆర్టీసి సంచలనం, ఇక డిజిటల్ పేమెంట్ తో ప్రయాణం..!!!

తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక నుంచి నగదు లేకుండా డిజిటల్ చెల్లింపుతో ఆర్టీసీ ప్రయాణం చేయడానికి వెసులుబాటు కల్పించింది.

  • Written By:
  • Updated On - August 31, 2022 / 06:18 PM IST

తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక నుంచి నగదు లేకుండా డిజిటల్ చెల్లింపుతో ఆర్టీసీ ప్రయాణం చేయడానికి వెసులుబాటు కల్పించింది. క్రెడిట్, డెబిట్‌ కార్డులతో క్యూఆర్‌ కోడ్‌తో యూపీఐ పేమెంట్స్‌ తీసుకోనున్నారు.ఆ మేరకు కరీంనగర్‌ రీజియన్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టికెట్లు ఇచ్చే విధానాన్ని సలభంగా మార్చేందుకు ఆర్టీసీ ఇప్పటికే టిమ్స్ ను ప్రవేశపెట్టింది. వాటి ద్వారానే డిజిటల్ పేమెంట్స్ జరపాలని నిర్ణయించింది. డెబిట్, క్రెడిట్‌ కార్డులతో స్వైపింగ్, క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది. ఈ విధానం గ్రేటర్‌ హైదరాబాద్‌లో అమలవుతుండగా తాజాగా కరీంనగర్‌ రీజియన్‌లో ప్రయోగత్మకంగా ప్రారంభించారు.

కరీంనగర్‌ రీజియన్‌లోని రాజధాని, హైటెక్, సూపర్‌లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సు సర్వీసుల్లో క్యాష్‌లెస్‌ సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం కొన్ని బస్సు సర్వీసుల్లోనే ఈ విధానం అమలవుతుండగా త్వరలోనే దశల వారీగా అన్ని బస్సుల్లో అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ పరికరాల వినియోగంపై సూపర్‌వైజర్లకు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న అధికారులు బస్సుల్లో ఈ సేవలను ప్రారంభించారు.

ఐ-టిమ్ముల ద్వారా బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి . ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అయితే, ఐ-టిమ్ములకు తప్పనిసరిగా ఇంటర్‌నెట్‌ ఉండాలి. అన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవు. దీనిని అధిగమించడానికి వీటిలో రెండు సిమ్ములను వేస్తున్నారు. దీంతో ఏదో ఒక నెట్ వర్క్ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఇక పూర్తిగా డిజిటల్ కరెన్సీ దిశగా ఆర్టీసీ పరుగు పెడుతుంది.